Sea Levels In Mediterranean Rising Dangerously Due To Climate Change - Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు

Published Mon, Jan 2 2023 5:18 AM

Sea levels in Mediterranean rising dangerously due to climate change - Sakshi

వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్‌ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్‌ సైక్లోన్‌ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది.

2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది!

20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు!
సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్‌ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్‌ అర్త్‌ స్పేస్‌ సైన్సెస్‌ జర్నల్‌ తాజాగా ప్రచురితమయ్యాయి.

అతి సున్నిత ప్రాంతం
నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్‌లాండ్‌ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్‌లాండ్‌ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది.                 
 
పెను ప్రమాదమే...!
సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు...
► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి
► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి
► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి
► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు.
► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది
► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి
► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది
► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది
► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement