జెడ్డా: సౌదీ అరేబియాలో నకిలీ “సౌదీకరణ” (fake saudization)కు పాల్పడుతున్న సంస్థలపై కేంద్ర మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 7,200కు పైగా వర్క్ వీసా ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో, సంబంధిత ప్రైవేట్ సంస్థలకు జారీ చేసిన 7,200కు పైగా వర్క్ వీసాలను అధికారులు రద్దు చేశారు. అదనంగా, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై మంత్రిత్వ శాఖ సేవలపై తాత్కాలిక నిషేధం కూడా విధించారు.
స్మార్ట్ నిఘా వ్యవస్థల సహాయంతో మొత్తం 91 వేల అనుమానిత కేసులను పరిశీలించగా, అందులో 13,509 నకిలీ సౌదీకరణ కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని సంస్థలు సౌదీ పౌరులను కేవలం పేరుకే ఉద్యోగాల్లో చూపించి “నితాఖత్” పథకం ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో మోసపూరితంగా నమోదు చేసిన ఉద్యోగులను నితాఖత్ జాబితా నుంచి తొలగించి, వారికి నిజమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మానవ వనరుల అభివృద్ధి నిధికి బదిలీ చేశారు.
మొదటి త్రైమాసికంలో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సుమారు 2.5 లక్షల సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 1.68 లక్షల కార్మిక నిబంధనల ఉల్లంఘనలు గుర్తించాయి. సంస్థలు తమ హోదాను సరిచేసుకోవాలని ఆదేశిస్తూ 2.30 లక్షల సంస్థలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.
ఇక రిక్రూట్మెంట్ కార్యాలయాలపై నిర్వహించిన తనిఖీల్లో 3,522 ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. గృహ కార్మికుల సేవలను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసినందుకు 238 సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా, అనుమానిత మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 54 వేల కేసులను మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన 15,563 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.


