Russia-Ukraine war: రష్యా పీఛేముడ్‌!

Russia-Ukraine war: Russian forces retreat from key Ukrainian city of Kherson - Sakshi

ఉక్రెయిన్‌లోని ఖెర్సన్‌ నుంచి వెనక్కు

మైకోలైవ్‌: ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు అవమానకరమైన రీతిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదిన్నర నెలల యుద్ధంలో స్వాధీనం చేసుకున్న ఏకైక ప్రాంతీయ రాజధాని ఖెర్సన్‌ను కూడా వదిలేసుకుంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి ఖెర్సన్‌ నగరం సహా నీపర్‌ నది పశ్చిమ తీరం నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. మిలటరీ సామగ్రిని కూడా వెనక్కి తరలించినట్లు వెల్లడించింది.

తాజా పరిణామాన్ని అధ్యక్షుడు పుతిన్‌ ఇబ్బందికరంగా భావించడం లేదని, ఖెర్సన్‌ ఇప్పటికీ తమదేనని రష్యా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఖెర్సన్, మరో మూడు ప్రాంతాలు తమవేనంటూ నెల క్రితం రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. రష్యా ఆర్మీ పూర్తి స్థాయి ఉపసంహరణకు కనీసం మరో వారం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఆర్మీ వెళ్లిపోయిన ఖెర్సన్‌లో పౌరులు ఉక్రెయిన్‌ జాతీయ జెండాలను ఎగురవేసి, హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఖెర్సన్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కష్టతరంగా ఉందంటూ అంతకుముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొనడం గమనార్హం. ఇటీవల తమ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపైకి రష్యా దాడులు కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. రష్యా బలగాలు దొంగచాటున దాడులకు పాల్పడే ప్రమాదముందని, ఖెర్సన్‌ను ల్యాండ్‌మైన్లతో మృత్యునగరంగా మార్చేశారని ఉక్రెయిన్‌ అధికారులు అంటున్నారు. ఖెర్సన్‌పై పట్టుసాధించిన ఉక్రెయిన్‌ ఆర్మీ రష్యా ఆక్రమణలోని క్రిమియా తదితర దక్షిణ ప్రాంతాలపైకి దృష్టి సారించనుంది. ఉక్రెయిన్‌ సైన్యానికి, సరఫరాల రవాణాకు తీరప్రాంత ఖెర్సన్‌ ఒబ్లాస్ట్‌ రాజధాని ఖెర్సన్‌ నగరం వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top