Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో జెండా పాతేద్దాం

Russia-Ukraine war: Russia newest strategy, Merger of occupied territories - Sakshi

రష్యా సరికొత్త వ్యూహం

ఆక్రమించిన ప్రాంతాల విలీనం?

ఖెర్సన్, హ్రివ్నియాల్లో రిఫరెండం!

ఇప్పటికే అధికార కరెన్సీగా రూబుల్‌

పౌరసత్వ దరఖాస్తుల స్వీకరణ

సైనిక నష్టాలతో ఉక్రెయిన్‌ డీలా?

ఊహించని ఎదురుదెబ్బల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో రష్యా వ్యూహం మార్చింది. ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ శాశ్వతంగా అట్టిపెట్టుకునేలా పుతిన్‌ పథక రచన చేస్తున్నారు. చాపకింద నీరులా ఆ దిశగా ఒక్కో చర్యా తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన 20 శాతం భూ భాగాన్ని రష్యాలో విలీనం చేసుకునేలా చర్యలను వేగవంతం చేశారు.

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి 100 రోజులు దాటింది. అధ్యక్షుడిని కూలదోసి తమ అనుకూల నేతను గద్దెనెక్కించడంతో రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న పోరు కాస్తా నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యూహం మార్చారని, ఉక్రెయిన్‌ నుంచి వైదొలగరాదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతాలను శాశ్వతంగా సొంతం చేసుకోనున్నట్టు చెప్తున్నారు.  ఆ దిశగా ఇప్పటికే రష్యా పలు చర్యలకు దిగింది కూడా. ఉక్రెయిన్లోని దక్షిణ ఖెర్సన్, హ్రివ్నియా ప్రాంతాల్లో రష్యా కరెన్సీ రూబుల్‌ అధికార కరెన్సీగా మారింది. అక్కడి పౌరులకు రష్యా పాస్‌పోర్టులు కూడా ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలను అధికారికంగా రష్యాలో భాగంగా ప్రకటించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి.

దీంతోపాటు తూర్పున డోన్బాస్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాద పాలకులు కూడా పూర్తిగా ఆ దేశంతో కలిసిపోవాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నట్టు క్రెమ్లిన్‌ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ 2019 నుంచి ఇప్పటిదాకా రష్యా 7 లక్షలకు పైగా పాస్‌పోర్టులిచ్చింది! ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్‌ భూ భాగాలను కొంచెం కొంచెంగా రష్యా విలీనం చేసుకుంటూ వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక విజయాలను వృథా పోనివ్వబోమన్న పుతిన్‌ అధికార ప్రతినిధి పెస్కోవ్‌ వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదేనంటున్నారు.

సైనికులు కావలెను!
మరోవైపు, రష్యా ముట్టడిని దీటుగా అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్‌ తాజాగా పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. యుద్ధంలో సైన్యాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో దేశాన్ని బలగాల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. రోజుకు కనీసం 60 నుంచి 100 మంది దాకా సైనికులను కోల్పోతున్నట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. మరోవైపు రష్యాకు సైనిక నష్టాలు యుద్ధం తొలి రోజులతో పోలిస్తే ఇటీవల బాగా తగ్గాయని జెలెన్‌స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్‌స్క్‌ శనివారం ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

జెలెన్‌స్కీ లెక్క ప్రకారం ఉక్రెయిన్‌ ఇప్పటిదాకా 10 వేల మంది సైనికులను కోల్పోయినట్టే. కానీ వాస్తవ ప్రాణ నష్టం అంతకంటే చాలా ఎక్కువగా ఉందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పున డోన్బాస్‌ ప్రాంతంపై రష్యా సైన్యం ప్రధానంగా దృష్టి సారించినప్పటి నుంచీ అక్కడ ఉక్రెయిన్‌ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌కు 2.5 లక్షల మంది సైనికులున్నారు. యుద్ధం మొదలయ్యాక లక్ష మంది దాకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైన్యంలో చేరారు.

ఈ 100 రోజుల యుద్ధంలో వీరిలో ఎంతమంది మరణించిందీ ఉక్రెయిన్‌ స్పష్టంగా వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా కన్పిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైనిక నష్టం ఉక్రెయిన్‌ను బాగా కలవరపెడుతోంది. దీన్ని తగ్గించుకోవాలంటే అత్యంత శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆయుధాలు తక్షణావసరమని ఉక్రెయిన్‌ సైనికాధికారులు చెబుతున్నారు. పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్నా వారికి శిక్షణ తదితరాలకు చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు.                 

భారీగా చేరికలు: ఉక్రెయిన్‌
తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం వాస్తవమేనని ఉక్రెయిన్‌ సైన్యాధ్యక్షుడు ముజెంకో అంగీకరించారు. అయితే, ‘‘ఈ మేరకు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన వాస్తవానికి మాకు చాలా మేలు చేస్తుంది. దానివల్ల మాకు పశ్చిమ దేశాల సాయుధ సాయం మరింతగా పెరుగుతుంది. ప్రజలందరికీ నిజం తెలిసింది గనుక దేశ రక్షణ కోసం వారు భారీ సంఖ్యలో ముందుకొస్తారు. అలా జరుగుతోంది కూడా. తద్వారా సైన్యంలో నైతిక స్థైర్యం బాగా పెరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు.

ఉక్రేనియన్లకు రష్యా పౌరసత్వం
ఉక్రెయిన్‌లో ఐదో వంతు ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిందని రష్యా తాజాగా ప్రకటించింది. ఇది నిజమేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అంగీకరించారు. డోన్బాస్‌తో పాటు ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో కూడా జూలై లోపే రిఫరెండం నిర్వహించే యోచన ఉన్నట్టు ఉక్రెయిన్‌తో చర్చల్లో పాల్గొన్న రష్యా బృందం సభ్యుడు లియోనిడ్‌ స్లట్‌స్కీ వెల్లడించారు! మెలిటోపోల్‌ వంటి నగరాల్లో రష్యా పౌరసత్వం కోసం పౌరుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారు కూడా.

మారియుపోల్‌ వంటి రష్యా ఆక్రమిత నగరాల్లో పలువురు పౌరులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండటం విశేషం! ‘‘రష్యా పౌరునిగా మారాలన్నది నా చిన్నప్పటి కల. ఇప్పుడు ఇంటినుంచి అడుగు కూడా కదల్చకుండానే అది నెరవేరేలా కన్పిస్తోంది’’ అని ఓ మారియుపోల్‌వాసి ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితి అంతటా లేదు. తమ అధీనంలోకి వచ్చిన ఖెర్సన్, ద్నిప్రోపెట్రోవ్స్‌క్, మారియుపోల్‌ తదితర ప్రాంతాల్లో రష్యన్లను స్థానిక అధికారులుగా క్రెమ్లిన్‌ నియమించగా పలుచోట్ల వారికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top