‘ఉక్రెయిన్‌ యుద్ధంలో హైప‌ర్‌సోనిక్ మిసైల్స్‌ వాడాం’

Putin Says Use Of Hypersonic Missiles Ukraine War - Sakshi

గత రెండేళ్ల నుంచి రష్యా.. ఉక్రెయన్‌పై దాడులతో యుద్ధం చేస్తూనే ఉంది. పలు ప్రాంతాలు రష్యా ఆక్రమించుకుంది. మరోవైపు పలుదేశాల మద్దతుతో ఉక్రెయిన్‌ సైతం రష్యా దాడులకు భయపడకుండా అదును చూసుకోని ప్రతిదాడులకు దిగుతోంది. తాజాగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి గురువారం మాట్లాడారు.

రష్యా ఆరేళ్ల కిందట ప్ర‌వేశ‌పెట్టిన అత్యాధునిక ఆయుధాల‌ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో కింజాల్‌, సిర్‌కాన్ లాంటి హైప‌ర్‌సోనిక్ మిసైల్స్‌ను ర‌ష్యా సైనిక బలగాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. అవి ఉక్రెయిన్ మిలిట‌రీ స్థావరాలను అత్యంత క‌చ్చిత‌త్వంతో దాడి చేసిన‌ట్లు కూడా తెలిపారు. అవ‌న్‌గార్డ్ స్ట్రాట‌జిక్ హైప‌ర్‌సోనిక్ గ్లైడర్లు, పెరిస్‌వెల్ లేజ‌ర్ వ్యవస్థలు ఇప్ప‌టికే పనిచేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యంగా హైప‌ర్‌సోనిక్ గ్లైడ‌ర్లు.. లక్ష్యం దిశ‌గా అణ్వాయుధాల‌ను మోసుకెళ్లుతాయి. హై ఆల్టిట్యూడ్‌లో అత్యంత వేగంగా ఆ మిసైల్స్‌ ప్ర‌యాణిస్తాయి. త్వ‌ర‌లోనే హెవీ స్ట్రాట‌జిక్ ఖండాంత‌ర బాలిస్టిక్ స‌ర్మట్‌ మిసైల్స్‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు పుతిన్‌ తెలిపారు. అణ్వాయుధ స‌హిత క్రూయిజ్ మిసైల్‌ బురెవెస్నిక్‌తో పాటు అండ‌ర్ వాట‌ర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top