వ్యాక్సిన్‌ను ప్రారంభించిన పుతిన్‌

Putin Says Russia Has Developed First  Coronavirus Vaccine - Sakshi

మాస్కో : కరోనా వైరస్‌ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు. ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని తెలిపారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను స్పుట్‌నిక్‌ వీగా వ్యవహరిస్తారు.

కాగా పుతిన్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్‌ వేయించినట్టు ప్రకటించారు. వ్యాక్సిన్‌ అందించిన తర్వాత ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని చెప్పారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. కోటి 34 వేల మంది పైగా ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక పలు దేశాల్లో కరోనా వైరస్‌ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. చదవండి : లిక్విడ్‌ బదులు జెల్‌ శానిటైజర్లు విక్రయించాలి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top