Turkey–Syria Earthquakes: మరుభూములుగా టర్కీ, సిరియా.. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు

Powerful Earthquakes In Turkey Syria Latest Updates - Sakshi

భారీ భూకంపాలు. ఊగిపోతూ పేక మేడల్లా కూలిన భారీ భవనాలు. వాటి కింద చిధ్రమైన బతుకులు.. విగతజీవుల్ని చూసి మిన్నంటుతున్న అయినవాళ్ల రోదనలు. సాయం కోసం శిథిలాల కిందే ఆర్తనాదాలతో ఎదురుచూపులు. ఈలోపు గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు. వెరసి.. సోమవారం సంభవించిన విలయం రెండు దేశాల్లో 4 వేలకు పైనే ప్రాణాలను బలిగొంది.  

7.8, 7.6, 6.0 రిక్టర్‌ ​స్కేల్‌పై నమోదు అయిన భూకంప తీవ్రత. 20 సార్లు శక్తివంతమైన ప్రకంపనలు. ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో ధరిత్రీ ప్రకోపానికి భారీగా ప్రాణ-ఆస్తి నష్టమే వాటిల్లింది. బిల్డింగ్‌ల శిథిలాల కింద నలిగిపోయిన బతుకులు.. గాయపడి సాయం కోసం కొందరు పెడుతున్న కేకలు.. తమ వాళ్లు ఏమైపోయారో అనే ఆందోళనతో మరికొందరు చేస్తున్న​ ఆర్తనాదాలు.. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.


టర్కీలో..

రోడ్లు దెబ్బతినడం, కరెంట్‌-ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయంతో పాటు చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడడంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రకృతి విలయం చేసిన గాయంతో.. వారం పాటు సంతాప దినాలు ప్రకటించుకుంది టర్కీ. పాశ్చాత్య, అగ్ర దేశాలతో పాటు భారత్‌ సహా మొత్తం పన్నెండు దేశాలు టర్కీకి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే రిలీఫ్‌ మెటీరియల్‌ను టర్కీకి పంపించాయి కూడా. వేల మంది ఇంకా శిథిలా కిందే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


టర్కీలో..

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాల్లో ప్రకంపనల ప్రభావం కనిపించిందంటే.. టర్కీ, సిరియాల్లో సంభవించిన విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు దేశాల్లోనూ శిథిలాల చిక్కుకున్న వాళ్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీశారు. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా నమోదు కాగా.. అధికంగా మృతుల సంఖ్య కూడా ఇక్కడే నమోదు అయ్యిందని తెలుస్తోంది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో భవన సముదాయాలు కుప్పకూలడం ఒక  ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 


సిరియాలో.. 

ఇదిలా ఉంటే.. 8వేల మందిని శిథిలాల నుంచి సురక్షితంగా రక్షించినట్లు అత్యవసర విభాగపు అధికారులు ప్రకటించుకున్నారు. సోమవారం నాటి భూకంపం ధాటికి 14వేల పైనే గాయపడగా.. వీళ్లలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరియాలోనూ క్షతగాత్రులు నాలుగు వేల మందికి పైనే ఉండొచ్చని అనధికార లెక్కలు చెప్తున్నాయి. 


సిరియాలో..

టర్కీ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో ఒకటి. భూగర్భంలోని వైవిధ్యతే అందుకు కారణం!. అందుకే భవన నిర్మాణాల విషయంలో ప్రామాణికత పాటించాలని అక్కడి నిపుణులు సూచిస్తుంటారు. 1939లో తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించి.. 33,000 మంది మరణించారు. డజ్సే ప్రాంతంలో 1999లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 17,000 మందికి పైగా మరణించారు. ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో 16 మిలియన్ల జనాభాతో.. ఇరుకు ఇరుకు ఇళ్లతో ఉంటుంది. భారీ భూకంపాలు వస్తే.. ఇస్తాంబుల్‌ సర్వనాశనం అవుతుందని నిపుణులు ఎన్నో ఏళ్ల నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ, అక్కడి జనం, అధికార యంత్రాంగం ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా భారీ భారీ బిల్డింగ్‌లు కడుతూ వస్తున్నారు. 

ఇక సిరియా సైతం భూకంప ప్రభావిత ప్రాంతమే. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్‌ ప్రాంతాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. పైగా  విషాదానికి ముందే అలెప్పోలోని(రష్యా యుద్ధ స్థావర కేంద్రం కూడా) భవనాలు కొన్ని కూలిపోతూ వస్తున్నాయి. అయినా అధికారులు ముందు జాగ్రత్త పడలేదు. అయితే ఇళ్ల నుంచి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు చాలామంది. ఇక సహజ వాయువు నిక్షేపాల ప్రాంతం కావడంతో.. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాయువుల సేకరణను, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో.. మరింత నష్టం జరగకుండా మాత్రం నిలువరించగలిగారు.

శవాల దిబ్బలుగా టర్కీ, సిరియా (ఫొటోలు)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top