గొప్ప కలలున్నాయి | PM Narendra Modi addresses the Indian Diaspora in the Netherlands | Sakshi
Sakshi News home page

గొప్ప కలలున్నాయి

May 17 2026 2:23 AM | Updated on May 17 2026 2:23 AM

PM Narendra Modi addresses the Indian Diaspora in the Netherlands

దేశ ఆకాంక్షలు సరిహద్దులకే పరిమితం కావు  

భారతదేశం నేడు అవకాశాల గనిగా మారింది  

మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది  

నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపు  

ద హేగ్‌:  భారత్‌ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. రాజధాని ద హేగ్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్‌ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్‌ ముందుకు సాగుతోందన్నారు. 

మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్‌’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్‌లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు.  

అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్‌లు  
‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్‌ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్‌ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది.   

తులిప్‌లు, తామర పువ్వులు  
భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. 

ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్‌ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్‌ తులిప్‌లకు, భారత్‌ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్‌ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది.  

ఓటింగ్‌లో కొత్త రికార్డులు గర్వకారణం  
అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్‌ చిరుతిండి ఝాల్‌మురీ నెదర్లాండ్స్‌ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

రాజ దంపతులతో మోదీ భేటీ  
నెదర్లాండ్స్‌ రాజు విల్లెమ్‌–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్‌–నెదర్లాండ్స్‌ సంబంధాలపై చర్చించారు.  

చోళుల రాగి ఫలకాలు భారత్‌కు అప్పగింత  
11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్‌ శనివారం భారత్‌కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్‌ ప్రధాని రోబ్‌ జెటెన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్‌లో లీడెన్‌ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్‌ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. 

ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్‌ నుంచి నెదర్లాండ్స్‌కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్‌కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వానికి, లీడెన్‌ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement