ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్ దాగుడు మూతలు ఆడుతోంది. పుకార్లను ఖండిస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని మాత్రమే ప్రకటనలు ఇస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఆఖరికి వాయిస్ రికార్డింగ్‌లు కూడా ఒక్కటి రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్యస్థితి ఏమాత్రం బాగోలేదని.. పైగా పాలన మొత్తం కరడుగట్టిన సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా సంచలన విషయాలను పబ్లిష్ చేసింది.
‘ఖమేనీ సజీవంగానే ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఆయనకు చికిత్స అందుతోంది. దాడుల్లో ఖమేనీ ముఖం, పెదవులు కూడా తీవ్రంగా కాలిపోయాయి. అందుకే మాట్లాడటం కూడా కష్టంగా మారింది. స్పృహలోనే ఉంటూ అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయనకు ఏదైనా చెప్పాలంటే రాసి చూపిస్తున్నారు. అలాగే.. ఆయనకు ఏదైనా సమాచారం చేరవేసేందుకు.. చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే వాడుతున్నారు. వాటిని ఖమేనీ ఉన్న ప్రాంతానికి బైక్‌లపై చేరవేస్తున్నారు. అక్కడి నుంచి బదులు కూడా అలాగే వస్తోంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారు..
దాడుల్లో కాలికి గాయం కావడంతో దానికి మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి కూడా సర్జరీ జరిగింది. ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గం కూడా అని ఆయన అనుకుంటుఉన్నారు’’ అని ఆ కథనాలు సారాంశం.
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా దాడులకు దిగాయి. ఆనాటి దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబం మరణించింది. ఆయన తనయుడు ఖమేనీ గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఆయన్నే ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇరాన్ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆయన్ని కలవడానికి వెళ్లడం లేదు.
పాలన చేజారిందంటూ..
దేశాన్ని నడిపేందుకు ముజ్తాబా ఖమేనీ ఓ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆ దేశ రాజకీయవేత్త అబ్దుల్‌రెజా దవారీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ బోర్డుకి ఖమేనీ డైరెక్టర్‌గా ఉండగా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సలహాలు, మార్గదర్శకాల పైనే ఖమేనీ ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారాయన. అంతేకాదు అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం, దౌత్య ప్రయత్నాలు, జాతీయ భద్రత విషయాల్లో వారు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే..
ఈ వ్యవహారంలో సుప్రీం లీడర్ పరిమితంగా వ్యవహరిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనం ఇచ్చింది. సుప్రీం లీడర్‌కి చేరుకోవడం కష్టమవడంతో.. నిర్ణయాధికారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిందని.. వాళ్లే యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. ఇది ఇరాన్ గత సుప్రీంల పాలనకు భిన్నంగా ఉందని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి డమ్మీలుగా మారిపోయారని.. అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా సైనికాధికారుల వ్యతిరేకత కారణంగానే విఫలమయ్యాయని తెలిపింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ జీవచ్ఛవంగా ఉండిపోయారని.. ఇరాన్‌లో “రెజీమ్ చేంజ్”(పాలన పగ్గాలు మారాయని) వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ మీడియా మాత్రం ఆ కథనాలను ఖండిస్తూ వస్తోంది.


