విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Pilot Dies In bathroom Of Plane Co Pilot Make Emergency Landing In US - Sakshi

విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో పైలట్‌ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్‌  విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్‌ ఇవాన్‌ అందౌర్‌ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.

వెంటనే కో పైలట్‌ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్‌ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్‌లో వసతి కల్పించారు. 

ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్‌ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్‌లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. 
చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top