అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్‌ 

Pegasus Blacklisted By US For Selling Spyware - Sakshi

రిచ్‌మండ్‌ (అమెరికా): భారత్‌లో తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం బయటపెట్టిన విషయం తెలిసిందే. అక్రమంగా ఫోన్లను హ్యాక్‌ చేశారనే విషయం భారత్‌లో ప్రకంపనలు సృష్టించింది. విపక్షాల నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో పాటు నిఘా పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ ‘కాండిరూ’ను నియంత్రిత సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థల ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని బైడెన్‌ సర్కారు పేర్కొంది.  

నియంత్రిత సంస్థల జాబితాలో చేరిస్తే... ఈ సంస్థలకు అమెరికా కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు, పరికరాలు లభించడం కష్టతరమవుతుంది. ఈ సంస్థలకు ఎగుమతులు చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనసరి కానుంది. అమెరికా విదేశాంగ విధానంలో మానవహక్కులకు పెద్దపీట వేయాలని బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందువల్లే ఎన్‌ఎస్‌ఓ, కాండిరూలను నియంత్రిత సంస్థల జాబితాలో చేర్చామని అమెరికా వాణిజ్యశాఖ తెలిపింది. పెగాసస్‌ స్పైవేర్‌తో అక్రమ నిఘా పెట్టారని, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్లు దాఖలు కావడంతో భారత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని నిగ్గుతేల్చడానికి కొద్దిరోజుల కిందటే రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంతో సాంకేతిక నిపుణులతో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. 

Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్‌ వినీషా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top