గరిష్ట వార్షిక పరిమాణానికి చేరుకున్న ఓజోన్‌ రంధ్రం

Ozone Hole Over Antarctic in its Maximum Annual Size - Sakshi

అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం దాని ‘గరిష్ట వార్షిక పరిమాణానికి’ చేరుకుందని ఓజోన్ పొరను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల సంవత్సరాలలో ఇది అతిపెద్ద, లోతైన వాటిలో ఒకటి అని  వారు తెలిపారు. ఓజోన్ పొర భూ ఆవరణలలో ఒకటైన స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఆ కిరణాల నుంచి మానవాళిని ఇతర ప్రాణులను కాపాడుతుంది. 
ఇండిపెండెంట్.కో. యూకే నివేదిక ప్రకారం, కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) శాస్త్రవేత్తలు  ఓజోన్ సాంద్రతలు అంటార్కిటికాపై 20 - 25 కిలోమీటర్ల ఎత్తులో సున్న విలువకు పడిపోయాయని కనుగొన్నారు. ఈ జోన్‌ను ట్రైఆక్సిజన్ అని కూడా పిలుస్తారు. 

ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఓజోన్‌ పొరలో చిన్న రంధ్రం ఏర్పడిందని, అది తరువాత పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలైన క్లోరో ఫ్లోరో కార్భన్ల( సీఎఫ్‌సీ)పై నిషేధాన్ని అమలు చేయాలని సైంటిస్ట్‌లు 2019లో చాలా బలంగా చెప్పారు. సీఎఫ్‌సీ ఓజోన్‌ పొర క్షీణతకు కారణమవుతాయి. గత వారం నుంచి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో ఓజోన్‌ క్షీణత ఎక్కువ అయ్యిందని సైంటిస్ట్‌లు తెలిపారు. 2019లో స్వల్ప ఓజోన్‌ పొర క్షీణతను గుర్తించిన తాము ఈ ఏడాది  కొంచెం పెద్ద రంధ్రాన్నే కనుగొన్నామని వారు చెప్పారు. దీనిని ఆపాలంటే మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ను అన్ని దేశాలు తప్పకుండా పాటించాలని సైంటిస్ట్‌లు విజ్ఞప్తి  చేశారు.       

చదవండి: షాకింగ్‌: ఓజోన్‌ పొరకు అతిపెద్ద చిల్లు..

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top