గంటల కొద్దీ జిమహలో కసరత్తు, ఆహార నియమాలు పాటించిన వారికే బరువు తగ్గడం అంత సులువు కావడం లేదు. తాము నటించే పాత్రలకోసం విపరీతంగా బరువు తగ్గిన వారిని చాలామందిని చూశాం. కానీ విచిత్రమైన పద్దతుల్లో కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వివరాలు ఉన్నాయి.
కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల, వారు పాటిస్తున్న కఠినమైన డైట్ ప్లాన్ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ కొరియన్ నటీమణులు న కిమ్ జి-వోన్, హా జి-వోన్, పార్క్ మిన్-యంగ్ ఇటీవల బాగా బరువు తగ్గి ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు.
వీరు గతం కంటే చాలా సన్నగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వారి అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభిమానులలో ఆందోళన పుట్టిస్తున్న డైట్ వివరాలు ఇలా ఉన్నాయి
కిమ్ జి-వోన్ (Kim Ji-won): మిలన్‌లో జరిగిన బల్గారి (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్‌లో ఈమె కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి కంటే చాలా సన్నగా మారడంతో అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
హా జి-వోన్ (Ha Ji-won): తన కొత్త డ్రామా 'క్లైమాక్స్' (Climax) కోసం ఈమె కావాలనే బరువు తగ్గారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఇమేజ్ ఉన్న ఈమె, తన పాత్ర కోసం కండరాల శాతాన్ని తగ్గించుకుని మరీ బలహీనంగా కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. "నన్ను నేను మార్చుకోవడం నటన కంటే కష్టమైంది" అని ఆమె పేర్కొన్నారు.
పార్క్ మిన్-యంగ్ (Park Min-young): ఈమె డైట్ పద్ధతి అందరినీ షాక్‌కు గురిచేసింది. గతంలో 'మ్యారీ మై హస్బెండ్' అనే ప్రాజెక్ట్ కోసం 37 కిలోలకు తగ్గిన ఆమె, తాజా డ్రామా 'సైరన్' (Siren) కోసం అదే పద్ధతిని కొనసాగించారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
కేవలం నీళ్లు , ఆల్కహాల్ డైట్?
పార్క్ మిన్-యంగ్ తన పాత్ర కోసం వివరిస్తూ, "నేను బరువు పెరిగితే ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే కేవలం నీళ్లు , ఆల్కహాల్‌ను మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. షూటింగ్ సమయంలో రోజుకు 3 లీటర్ల నీరు తాగేదాన్ని" అని వెల్లడించారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
నటీనటులు తమ పాత్రల కోసం ఇలాంటి ప్రాణాంతకమైన డైట్‌లు చేయడం, చాలా కఠినమైన వ్యాయామాలు చేయడం కేవలం నీటిపైనే ఆధారపడటం వంటివి సమాజంలో ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పుతున్నాయనే చర్చకు దారితీసింది. నటన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


