మహిళే ఒక సైన్యం

Nve Thazin Protest Against Myanmar Military - Sakshi

బయటికొస్తే అరెస్ట్‌ చేస్తాం. ‘ఎవడాడు ఆ మాటన్నది?!’ పన్నులు కట్టకుంటే ముక్కులు పిండుతాం.‘ఎవడాడు ఆ మాటన్నది?!’శాసనాన్ని ధిక్కరిస్తే జైలే. ‘ఎవడాడు ఆ మాటన్నది?! ఆ మాటన్నది ఎవరైనా..  ‘ఎవడాడు’ అన్నది మాత్రం మహిళే! మహిళా సైన్యం అంటాం కానీ.. మహిళే ఒక సైన్యం! ప్రతి శాసనోల్లంఘనలో ముందుంది మహిళే. ముందుకు నడిపించిందీ మహిళే.

రేపు సోమవారానికి వారం మయన్మార్‌లో ప్రభుత్వం పడిపోయి. పార్లమెంటులో మెజారిటీ తగ్గి పడిపోవడం కాదు. సైన్యం ట్యాంకులతో వెళ్లి ప్రభుత్వాన్ని కూల్చేసింది. దేశాన్ని ప్రెసిడెంట్‌ చేతుల్లోంచి లాగేసుకుంది. పాలకపక్ష కీలక నేత ఆంగ్‌ సాన్‌ సూకీని అరెస్ట్‌ చేసి గృహ నిర్బంధంలో ఉంచింది. కరోనా సమయంలో షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, వాకీ టాకీని ఫారిన్‌ నుంచి దిగుమతి చేసుకోవడం.. ఇవీ ఆమెపై సైన్యం మోపిన నేరారోపణలు! దీన్ని బట్టే తెలుస్తోంది. పాలనను హస్తగతం చేసుకోడానికి సైన్యం పన్నిన కుట్ర ఇదంతా అని! దేశంలో ఎవరైనా తిరగబడితే సైన్యం దిగుతుంది. సైన్యమే తిరగబడితే ఎదురు తిరిగేవాళ్లెవరు? సైన్యం పేల్చిన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మయన్మార్‌ వీధులపై నెమ్మదిగా దొర్లుకుంటూ వెళుతున్న చెయిన్‌ చక్రాల కరకరలు విన్నవారికి తెలుస్తుంది. అయితే ఆ కరకరల మధ్య.. బుధవారం నాటికి ఒక కొత్త ధ్వని వినిపించడం మొదలైంది. ఆ ధ్వని.. సైన్యాన్ని ధిక్కరించి ఇళ్లలోంచి బయటికి వచ్చిన మహిళల ‘డిజ్‌ఒబీడియన్స్‌’! అవిధేయ గర్జన. ‘వియ్‌ డోంట్‌ వాట్‌ దిస్‌ మిలిటరీకూ’.. అన్నది ఆ మహిళల నినాదం. 

సైనిక కుట్రకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ప్రదర్శన జరుపుతున్న మయన్మార్‌ మహిళా టీచర్‌లు

సైన్యం శాసించింది. ఆ శాసనాన్ని మయన్మార్‌ మహిళావని ఉల్లంఘించింది. మొదట సోమవారమే కాలేజీ అమ్మాయిలు మగపిల్లల వైపు చూశారు. ‘వేచి చూద్దాం’ అన్నట్లు చూశారు మగపిల్లలు. యూనివర్శిటీలలో మహిళా ప్రొఫెసర్‌ లు.. ‘ఏంటిది! ఊరుకోవడమేనా?’ అన్నట్లు మేల్‌ కొలీగ్స్‌తో మంతనాలు జరిపారు. ‘ప్లాన్‌ చేద్దాం’ అన్నారు వాళ్లు. మెల్లిగా ప్రభుత్వ శాఖల సిబ్బంది పని పక్కన పడేయడం మొదలైంది. బుధవారం నాటికి లెక్చరర్‌లు బయటికి వచ్చారు. మహిళా లెక్చరర్‌లు! వెంట సహోద్యోగులు. యాంగన్‌ యూనివర్శిటీ ప్రాంగణం బయటికి వచ్చి ఎర్ర రిబ్బన్‌లతో సైన్యానికి తమ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి టీచర్‌లు, హెల్త్‌ వర్కర్‌లు కూడా పోరుకు సిద్ధమై వీధుల్లోకి వచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పాలనను ఉల్లంఘించి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. సైన్యాన్ని ధిక్కరించి మయన్మార్‌ మహిళలు బర్మాను రక్షించుకోవాలనుకున్నారు. తమ మహిళా నేత ఆంగ్‌ సాగ్‌ సూకీ వారిలో నింపిన స్ఫూర్తే ఇప్పుడు వారిని సైనిక కుట్రకు వ్యతిరేకం గా కదం తొక్కిస్తోంది. మయన్మార్‌ను సైన్యం నుంచి విడిపించుకునేందుకు నడుం బిగిస్తోంది. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేకంగా కూలదోస్తే చూస్తూ ఊరుకోం’’అని న్వే తాజిన్‌ అనే మహిళా లెక్చరర్‌ పిడికిలి బిగించారు. 
                                                                     ∙∙ 
మహిళల ముందడుగుతో మొదలైన శాసనోల్లంఘనలు చరిత్రలో ఇంకా అనేకం ఉన్నాయి! 1930 – 1934 మధ్య గాంధీజీ నాయకత్వం వహించిన మూడు ప్రధాన శాసనోల్లంఘనలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల చేయూత, చొరవ, చేవ అండగా ఉన్నాయి. గాంధీజీ తొలి శాసనోల్లంఘన చంపారన్‌ (బిహార్‌)లో,  రెండో శాసనోల్లంఘన అహ్మదాబాద్‌లో, మూడో శాసనోల్లంఘన దండి (సూరత్‌ సమీపాన) జరిగాయి. దండి ఉల్లంఘనలో దేవి ప్రసాద్‌ రాయ్‌ చౌదరి, మితూబెన్‌ ఆయన వెనుక ఉన్నారు. చంపారన్‌ శాసనోల్లంఘనలో నీలిమందు పండించే పేద రైతుల కుటుంబాల్లోని మహిళలు కొంగు బిగించి దోపిడీ శాసనాలపైకి కొడవలి లేపారు. అహ్మదాబాద్‌ జౌళి కార్మికుల ఉపవాస దీక్షలో, గుజరాత్‌లోనే ఖేడా జిల్లాలో పేద రైతుల పన్నుల నిరాకరణ ఉద్యమంలో మహిళలు సహ చోదకశక్తులయ్యారు. గాంధీజీనే కాదు.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్, జేమ్స్‌ బెవెల్, రోసా పార్క్స్‌ వంటి అవిధేయ యోధులు అమెరికాలో నడిపిన 1950–1960 ల నాటి శాసనోల్లంఘన ఉద్యమాలన్నిటి ఆరంభంలో జ్వాలకు తొలి నిప్పుకణంలా మహిళా శక్తి ఉంది. రోసా పార్క్‌ అయితే స్వయంగా ఒక పెద్ద పౌరహక్కుల ఉద్యమాన్నే నడిపించారు. యాక్టివిస్టు ఆమె. ‘ది ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌’ అని ఆమెకు పేరు. 
                                                                           ∙∙ 
అన్యాయాన్ని బాహాటం ధిక్కరించే గుణం పురుషుల కన్నా స్త్రీలకే అధికం అని జీవ శాస్త్రవేత్తలు అంటారు. అందుకు కారణం కూడా కనిపెట్టారు. పురుషుడు బుద్ధితోనూ, స్త్రీ హృదయంతోనూ స్పందిస్తారట. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని, మోసపూరిత శాసనాన్ని ప్రశ్నించడానికి బుద్ధి ఆలోచిస్తూ ఉండగనే, హృదయం భగ్గుమని ఉద్యమిస్తుందట. ఈ సంగతి తాజాగా ఢిల్లీలోని రైతు ఉద్యమంలోనూ రుజువవుతోంది. అయితే అక్కడింకా శాసనోల్లంఘన వరకు పరిస్థితి రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తొలి ధిక్కారం, తొలి ఉల్లంఘన సహజంగానే మహిళలదే అయివుండే అవకాశం ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top