Coronavirus In North Korea Updates: టీకా వేస్ట్‌.. ఉప్పు నీళ్లే బెస్ట్‌

North Korea Tells Citizens to Gargle Salt Water to Fight Covid - Sakshi

North Korea Tells Citizens to Gargle Salt Water to Fight Covid: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉప్పు నీళ్లే ఉత్తమమని ఉత్తరకొరియా సూచించింది. వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నా వంటింటి చిట్కాలను పాటిస్తే చాలని కిమ్‌ సర్కార్‌ సూక్తులు చెబుతోంది. మరోవైపు ఉత్తరకొరియాలో వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల వరకూ మా దేశంలో ఒక్కకేసు నమోదు కాలేదంటూ ఉత్తర కొరియా గొప్పగా చెప్పుకుంది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో కొవాక్స్‌ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కోవిడ్‌ పంజా విసురుతోంది. ఈ క్రమంలో వైరస్‌వ్యాప్తిని అరికట్టేందుకు కిమ్‌ జాంగ్‌ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుక్కిలించడం సహా ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది. సాంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. దాంతోపాటు విల్లో ఆకులు, అల్లం టీ తీసుకుంటే సరిపోతుందని ఆ మహిళ చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది.

చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు)

ఉత్తర కొరియా అధికార మీడియా కేసీఎన్‌ఏ ప్రకారం దేశంలో 1.7 మిలియన్లకు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్కరోజే 2.32లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కి పెరిగింది. ప్రస్తుతం 6,91,170మంది క్వారంటైనలో ఉన్నారు. అయితే జ్వరం లక్షణాలను కిమ్‌ సర్కార్‌ ఇప్పటివరకూ కరోనాగా గుర్తించలేదు. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలురెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10లక్షల మంది ప్రజలు అనుమానిత కోవిడ్‌ నుంచి కోలుకున్నట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. పరీక్షలు చేసేందుకు సరైన వసతులు లేకపోవడం వల్ల చాలా మంది కేసులను కోవిడ్‌-19గా గుర్తించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నిపుణలు అనుమానిస్తున్నారు.

చదవండి: (కిమ్‌ను భయపెడుతున్న కరోనా.. ఫుల్‌ టెన్షన్‌లో నార్త్‌ కొరియన్లు)

సరైన ఔషదాలు, సామాగ్రి, వైద్యపరికరాలు లేకపోయినప్పటికీ 10 లక్షల మంది ప్రజలు ఎలా కోలుకున్నారన్నది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలు కాస్త తగ్గగానే క్వారంటైన్‌ నుంచి పంపించేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కరోనా సమాచారం అందించాలని కోరినప్పటికీ ఉ‍త్తర కొరియా స్పందించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తర కొరియాలో చాలా మంది ప్రజలు కోవిడ్‌ బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు చేయకపోవడం వల్ల జరిగే వ్యాప్తి కొత్త వేరియంట్‌లు ఉద్భవించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దేశాలు తమ సాయాన్ని అంగీకరించేంతవరకు కోవిడ్‌ కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఏం చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top