షరియా.. ఉల్లంఘిస్తే ఉరే

No democracy, only Sharia law in Afghanistan - Sakshi

తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ మహిళల పరిస్థితిపై ఆందోళన

ఇస్లాంలో షరియా చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్న తాలిబన్లు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా?
వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు.

► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా?
ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి.

► మగ స్నేహితులను కలవొచ్చా?
12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు.

► చదువుకోవచ్చా?  
మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే.

► మేకప్‌ వేసుకోవచ్చా?
మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్‌ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు.

► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా?
షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్‌ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు.

► కార్యాలయాల్లో పని చేయవచ్చా?  
చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట.  

► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా?
అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి.

► బిగ్గరగా మాట్లాడొచ్చా?
అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం.

► హై హీల్స్‌ సంగతేంటి?
ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు.

► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా?
తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి.

► సినిమాల్లో నటించవచ్చా?  
మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్‌ చేయరాదు.

► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top