5 నిమిషాల్లో ఎలక్ట్రిక్‌ కారు చార్జ్‌! | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో ఎలక్ట్రిక్‌ కారు చార్జ్‌!

Published Sat, Oct 8 2022 5:39 AM

New space tech can charge electric cars in just five minutes - Sakshi

వాషింగ్టన్‌: భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్‌ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్‌ చార్జ్‌ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్‌ స్టేషన్‌లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్‌ కార్లను చార్జ్‌ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్‌లో కొందరు విద్యుత్‌ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు.

ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్‌నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్‌నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్‌ ఎక్స్‌పరిమెంట్‌తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్‌ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్‌ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది.

దీనికి చెక్‌పెట్టేందుకు ద్రవ కూలెంట్‌ను ముందుగా చార్జింగ్‌ కేబుల్‌ గుండా పంపించారు. ఇది కరెంట్‌ను మోసుకెళ్లే కండక్టర్‌లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్‌ చేయడం సాధ్యమైంది. కరెంట్‌ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్‌ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్‌ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్‌ల ఫ్లూయిడ్‌ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు.

Advertisement
Advertisement