ఇదో వింత.. ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు!

Mystery Object Being Dragged Into Black Hole At Center Of Our Galaxy - Sakshi

కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్‌133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో ఉండగా, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్‌1758ఎస్‌ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉంది. 

నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు.

శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం
తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. 

ఈ కృష్ణ బిలం సీఓఎస్‌–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్‌ మిల్లీమీటర్‌ అరే (ఏఎల్‌ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్‌–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ తాలూకు జర్నల్‌ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top