మరో ఆప్షన్‌ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్‌స్కీని మట్టుబెట్టాల్సిందే!

Moscow Left With No Option Other Than Elimination Of Zelenskyy - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను డ్రోన్లతో హత్య చేయడానికి ఉక్రెయిన్‌ పన్నిన కుట్రను.. భద్రతా సిబ్బంది భగ్నం చేశాయి. అధ్యక్ష నివాసంలో పుతిన్‌ ఉంటున్న ఫ్లోర్‌కు అతి సమీపంగా రెండు డ్రోన్లు వెళ్లాయని,  వాటిని నేల​ కూల్చినట్లు బుధవారం క్రెమ్లిన్‌ వర్గాలు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో వర్గాలు.. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని ఉక్రెయిన్‌ అంటోంది.  

మరోవైపు పుతిన్‌పై హత్యాయత్నానికి రష్యా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, పుతిన్‌కు ఆప్తుడు దిమిత్రి మెద్వెదేవ్. ఉక్రెయిన్‌ ఉగ్రదాడికి  కౌంటర్‌గా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మట్టుబెట్టాల్సిందేనని రష్యా బలగాలకు సూచిస్తున్నాడు ఆయన. 

ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వెదేవ్‌ తాజా పరిణామాలపై స్పందిస్తూ..  ‘‘రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ద్వారా ఉక్రెయిన్‌ ఉగ్రచర్యలకు దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ముందు ఒకేఒక్క ఆప్షన్‌ ఉంది. అది జెలెన్‌స్కీని మట్టుబెట్టడమే. ఇక ఆ హిట్లర్‌(జెలెన్‌స్కీని ఉద్దేశించి..) లొంగిపోవాల్సి  అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోతానని వచ్చినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాస్కో ముందు మరో ప్రత్యామ్నాయమూ అక్కర్లేదు. అతన్ని భౌతికంగా లేకుండా చేయడమే ఇప్పుడు రష్యా బలగాలు చేయాల్సిన పని అని మెద్వెదేవ్‌ చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. మంగళవారం అర్ధరాత్రి పుతిన్‌ అధ్యక్ష అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్‌ UAV(మానవ రహిత) దాడులకు తెగబడిందని, వాటిని చాకచక్యంగా నేలకూల్చామని,  ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని మాస్కో వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో పుతిన్‌ ఇంట్లో లేడని వెల్లడించిన ఆయన సిబ్బంది.. మాస్కోలోని తన నివాసం నుంచే ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారని తెలిపింది. అంతేకాదు మే 9వ తేదీన రెడ్‌ స్క్వేర్‌ వద్ద జరిగే విక్టరీ డే పరేడ్‌పై ఈ డ్రోన్‌ ఎటాక్‌ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. 

జెలెన్‌స్కీ ఏమన్నారంటే..
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. రష్యా ఆరోపణలను ఖండించారు. పుతిన్‌పై గానీ, మాస్కోపైగానీ ఉక్రెయిన్‌ దళాలు ఎలాంటి దాడులకు యత్నించలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి దాడులకు సరిపడే ఆయుధ సంపత్తి ఉక్రెయిన్‌ వద్ద లేదని చెబుతున్నారాయన. మేం మా దేశ సరిహద్దులోనే పోరాడుతున్నాం. మా గ్రామాలను, నగరాలను రక్షించుకుంటున్నాం. మా వద్ద అలాంటి దాడులు చేయాలన్నా.. అందుకు తగ్గ ఆయుధాలు లేవు. అంతేసి ఖర్చు చేసే పరిస్థితుల్లోనూ లేం అని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మొసలి కడుపులోకి ఎలాగ వెళ్లాడంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top