పక్షిని ఫూల్‌ చేసిన ముంగిస.. ఒక్కసారి కాదు!

Mongoose Acting Dead On Hornbill Bird Attack Time In South Africa - Sakshi

పక్షిని చంపి ఆహారంగా చేసుకుందామని వెళ్లిన ముంగిసకు చుక్కెదురైంది. పక్షి ఎదురు తిరగడంతో ఇక తన చావుకు వచ్చిందని గ్రహించి ముంగిస చావు తెలివితేటలు చూపించింది. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన కథ మాదిరి పక్షి, ముంగిస మధ్య సన్నివేశం జరిగింది. ఈ సన్నివేశం నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది. ఎలుగుబంటి ఎదురైతే శవంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చనే కథ చదివే ఉంటారు. ఆ మాదిరి ముంగిస, హార్న్‌బిల్‌ పక్షి మధ్య జరిగింది. ఆ సరదా ఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్‌ గేమ్‌ రిజర్వ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండవుతోంది.

పుసుపు ముక్కు గల హార్న్‌బిల్‌ పక్షి సరస్సులో నీరు తాగేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముంగిసలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక ముంగిస ఆ పక్షి వద్దకు వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ముంగిసపై పక్షి ఎదురుదాడి చేసింది. దీంతో భయాందోళన చెందిన ముంగిస వెంటనే చావు తెలివితేటలు చూపించింది. మూర్చ వచ్చిన మాదిరి కొన్ని సెకన్ల పాటు బోర్లా పడుకుంది. దీంతో పక్షి దాన్ని ఏం చేయకుండా వెను తిరిగింది. మరొకసారి ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ అదే సన్నివేశం జరిగింది. దీంతో అక్కడికి వచ్చిన సందర్శకులు, పర్యాటకులు ఈ సరదా సన్నివేశం చూసి నవ్వుకున్నారు. హార్న్‌బిల్‌ పక్షి, ముంగిస మధ్య జరిగిన ఆ సరదా సంఘటన ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్‌ లైఫ్‌ ప్రతినిధులు షేర్‌ చేశారు. మీరు చూడండి.. నవ్వేసేయండి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top