ది హేగ్: ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌లో పర‍్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ ఆర్నాల్డస్ జెట్టెన్‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో రియర్ అడ్మిరల్ లుడ్‌గర్ బ్రుమ్మెలార్, అజుటెంట్ జనరల్, హిస్ మజెస్టీ ది కింగ్ సైనిక విభాగం చీఫ్, డచ్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్, నెదర్లాండ్స్‌లో భారత రాయబారి కుమార్ తుహిన్, డచ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు.
వాణిజ్యం, పెట్టుబడులు, నీరు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకే పరిమితం కాకుండా భారత్-నెదర్లాండ్స్ సహకారం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, విద్య, సముద్ర రంగాల్లో భాగస్వామ్యం బలపడిందని విదేశాంగ శాఖ తెలిపింది.
నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. “ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80–90% ఓటింగ్ నమోదైంది. మహిళలు కూడా భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు... ప్రతి ఏడాది ఓటింగ్ రికార్డులు బద్దలవుతున్నాయి. 2014లో భారత్‌లో కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవి. ఇప్పుడు భారత్‌లో దాదాపు 125 క్రియాశీల యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. స్టార్టప్‌లు ఇప్పుడు కృత్రిమ మేధస్సు, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విశేషంగా పని చేస్తున్నాయి. పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతి ఇప్పుడు మరింత విస్తరిస్తోంది.
ఇప్పుడు భారత్ పెద్ద పెద్ద కలలు కంటోంది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ల రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత యువత ఆశిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లోనే ఉంది. ఆధునిక భారత్ ఎన్నడూ లేని మార్పుల దశలో సాగుతోంది. ప్రపంచంలోనే ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని దేశం అమలు చేస్తోంది.
సరిగ్గా ఇదే రోజు 2014 మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీతో స్థిర ప్రభుత్వాన్ని భారత్ పొందబోతోందని అప్పుడే స్పష్టమైంది. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం నన్ను ఆగనివ్వకుండా చేస్తోంది.. అలసట చెందకుండా చేస్తోంది.. నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా... 12 ఏళ్లు ప్రధానమంత్రిగా సేవలు అందించాను... ప్రజాస్వామ్య ప్రపంచంలో 25 ఏళ్ల పాటు కోట్లాది ఓటర్ల మద్దతు దక్కింది... ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మీ ఆశీర్వాదం. అదే నా అతిపెద్ద సంపద’’ అని మోదీ అన్నారు.


