
భారతీయ విద్యార్థిని సాహసం
గ్రాడ్యుయేషన్ వేడుకలో కెఫియే ధరించి ప్రసంగం
కేంబ్రిడ్జ్ (యూఎస్): పాలస్తీనా మాటెత్తితే చాలు, ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతికి చెందిన మేఘ వేమూరి అనే విద్యార్థిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మద్దతు పలికారు. ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌తో తమ వర్సిటీ పరిశోధన ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించారు.
పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా కెఫెయే (హిజాబ్ వంటిది) ధరించి మరీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు! తన ప్రసంగంలో పాలస్తీనాకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది. వాటిని ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు.
మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు, విద్యావేత్తలు, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం. ఎంఐటీ పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం’’ అని ఆమె ఉద్ఘాటించారు. అమెరికాలో విద్యా రంగంలో అనిశ్చితి, విద్యార్థి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా మేఘ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా విద్యాసంస్థలపై అనిశ్చితి చీకట్లు కమ్ముకున్నాయన్నది బహిరంగ రహస్యం. తర్వాత ఏం జరగనుందనే ప్రశ్న మా మనస్సుల్లో ప్రతిధ్వనిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంఐటీ విద్యార్థులుజాతి విధ్వంసాన్ని సహించరు
అమెరికాలో చాలామంది విద్యార్థుల హృదయాల్లో భయాందోళనలు గూడుకట్టుకుని ఉన్నాయని మేఘ అన్నారు. ‘‘మేమంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం. గాజాలో మాత్రం అసలు విద్యా సంస్థలే లేకుండా చేశారు. పాలస్తీనాను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో ఎంఐటీ కూడా భాగస్వామి కావడం సిగ్గుచేటు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు ఎంఐటీ విద్యార్థులు పిలుపునిచ్చారు. క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. వర్సిటీ నుంచే బెదిరింపులు, అణచివేత ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంఐటీ విద్యార్థులు మారణహోమాన్ని ఎప్పటికీ సహించరు. జాతి విధ్వంసాన్ని హర్షించరు’’ అని స్పష్టం చేశారు.