
మిన్నియాపాలిస్ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పుల తర్వాత రాబిన్ వెస్ట్‌మన్ (Robin Westman) తనంతట తాను కాల్చుకుని చనిపోయాడు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే అతని గురించి విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.
అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం మిన్నసోటా స్టేట్ మిన్నియాపాలిస్ నగరంలోని ఓ స్కూల్ వద్ద ప్రార్థనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల కోసం రైఫిల్, షాట్‌గన్, పిస్టల్.. ఉపయోగించాడు. ఆ వెంటనే తనను తాను కాల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 8, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 14 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. దుండగుడి ఆయుధాలపై 'న్యూక్ ఇండియా', ‘కిల్ ట్రంప్’ లాంటి భయానక సందేశాలు రాసి ఉన్నాయి.
రాబిన్ వెస్ట్‌మన్.. 2020లో రాబర్ట్ నుండి రాబిన్‌గా పేరు మార్చుకుని మహిళగా గుర్తింపు పొందినట్లు లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్.. నిందితుడు పురుషుడేనని ధృవీకరించారు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం ట్రాన్స్‌జెండర్‌గానే విచారణను కొనసాగిస్తున్నారు. ఇక కాల్పులకు ముందు రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. అందులో ఆయుధాలు, మ్యాగజైన్లు కనిపించాయి. వాటిపై..
కిల్ డొనాల్డ్ ట్రంప్ నౌ Kill Donald Trump Now, న్యూక్(న్యూక్లియర్ వార్) ఇండియాNuke India, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్Israel must fall, బర్న్ ఇజ్రాయెల్Burn Israel, వేర్ ఈజ్ గాడ్Where is your God?, ఫర్ ది చిల్ట్రన్ For the children అని రాసి ఉంది. అంతేకాదు.. గతంలో కాల్పుల ఘటనలకు పాల్పడిన పలువురు దుండగుల పేర్లు కూడా రాసుకుని చూపించాడు. వాటితో పాటు సిరిలిక్ Cyrillic(రష్యా, బల్గేరియా, సెర్బియా, ఉక్రెయిన్, కజకస్తాన్, కిర్గిజ్ వంటి దేశాల్లో అధికారిక లిపి)లో రాసిన సందేశాలు కనిపించాయి.

ఒక వీడియోలో.. ఇది నా కోసం. అవసరమైతే ఉపయోగిస్తాను అని రాబర్ట్ చెబుతున్న దృశ్యం ఉండగా.. మరో దాంట్లో రెండు జర్నల్స్ కనిపిచాయి. అవి కూడా సిరిలిక్ లిపిలోనే ఉన్నాయి. యూట్యూబ్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేయించిన అధికారులు.. ఈ సందేశాలను ఎందుకు రాసుకున్నాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ కాల్పుల ఘటనను విద్వేషపూరిత దాడిగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. కేథలిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడమే అతని ధ్యేయంగా కనిపిస్తోందని, దీనిని దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఎలాంటి నేర చరిత్ర లేని వెస్ట్‌మన్.. అధికారికంగానే తుపాకులను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్ట్రీ నోయెమ్ ఘటనపై స్పందించారు. ఈ స్థాయి హింస ఊహించలేనిది. ఆయుధాలపై అతను రాసిన రాతలను బట్టి మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నాడని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమెరికాలో స్కూల్ భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని.. దుండగుడి మానసిక స్థితి, ఆన్‌లైన్ ప్రేరణలు, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా స్పందిస్తూ.. ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి.. అమానుషం అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల పట్ల గౌరవ సూచికంగా జాతీయ జెండాను సగం ఎగరేయాలని ఆదేశించారు. ఇక.. తాజా ఘటన ఈ ఏడాది విద్యాసంస్థలపై జరిగిన 146వ స్కూల్ కాల్పుల ఘటన కావడం గమనార్హం.