
మిన్నియాపొలిస్: అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలోని ఓ స్కూలులో బుధవారం ఉదయం ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులే కావడం గమనార్హం. అనంతరం ఆగంతకుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. గాయపడిన 6–15 ఏళ్ల మధ్య చిన్నారులకు ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. అనన్సియేషన్ కాథలిక్ చర్చిలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. అతడికి ఎలాంటి నేరచర్రిత లేదని అధికారులు వివరించారు.
తుపాకీపై ‘న్యూక్ ఇండియా’
మిన్నియాపొలిస్ కేథలిక్ చర్చి స్కూలులో హంతకుడు కాల్పులకు వాడిన ఒక తుపాకీపై ‘న్యూక్ ఇండియా’అని రాసుంది. వెస్ట్‌మన్ తన వద్ద ఉన్న ఆయుధాలను చూపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతడి చేతిలో ఉన్న తుపాకీల్లో ఒక దానిపై న్యూక్ ఇండియా అనీ, మరో దానిపై మాషా అల్లా అనీ, ‘ మరో గన్‌పై ఇజ్రాయెల్ ఓడిపోవాల్సిందే’ అని రాసి ఉంది.