International Women's Day 2021: ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు

March 8 Is A Symbol of The Struggle Of Working Women - Sakshi

మార్చి 8 శ్రామిక మహిళల పోరాటానికి సంకేతం. 19వ శతాబ్దంలో న్యూయార్క్‌ నగరంలో సమాన వేతనానికి, పది గంటల పనికోసం మహిళల పోరాటాలు, త్యాగాల ఫలితంగా 1910లో మార్చి 8కి అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తింపు వచ్చింది. వివిధ సందర్భాల్లో మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రష్యాలో జార్‌ చక్రవర్తి ఆగడాలకు వ్యతిరేకంగా రొట్టె కోసం 1917 విప్లవ కాలంలో మార్చి 8న పెట్రోగార్డ్‌లో వేలాది మహిళలు బ్యానర్లతో ప్రదర్శన చేశారు. మహిళలు బుర్ఖా వేసుకోకుండా బయటకు రాకూడదని 1970లో ఇరాన్‌ అధ్యక్షుడు అయతుల్లా ఖోమేని మార్చి 7న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేలాది మహిళలు ప్రదర్శనలు జరిపారు. 2018 మార్చి 8న 170 దేశాల సమన్వయంతో అంతర్జాతీయంగా మహిళల సమ్మె జరిగింది. హింసకు, ఇంకా అనేక రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఎనిమిది రకాల డిమాండ్లతో రోడ్లన్నీ నిండిపోయాయి.

మన దేశంలో 2012లో ఢిల్లీ రాజధాని నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా పోరాటంలో మహిళలు, పురుషులతో సమానంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అమరులైనారు. 1970లో నాటి ఉత్తరప్రదేశ్‌లోని అడవులను పారిశ్రామికవేత్తల నుంచి రక్షించడానికి దశౌలీ గ్రామ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో 2,500 చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. మహిళలు చెట్లను హత్తుకొని కాపాడటం వల్ల దీనికి ‘చిప్కో’ ఉద్యమమనే పేరు వచ్చింది. 1995లో హరియాణాలోని ఖాప్‌ పంచాయతీ ఒక కుటుంబానికి శిక్ష వేసే క్రమంలో పన్నెండేళ్ల బాలికను అత్యాచారం చేయాలనే తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని వెయ్యి మంది మహిళలు సంఘటితంగా ఉద్యమించారు. మణిపూర్‌లో 2004లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా ముప్పైమంది మహిళలు నగ్నంగా ఇంఫాల్‌లో నిరసన ప్రదర్శన చేశారు.1992లో సారా వ్యతిరేక ఉద్యమం చరిత్ర సృష్టించింది.

1991లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల మహిళలపై మరింత భారం పడింది. సామ్రాజ్యవాద సంస్కృతి కొత్త రూపాలలో మహిళలపై హింసను పెంచింది. రోజూ 88 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో రాజస్తాన్‌లో 6,000, యూపీలో 3,165 అత్యాచార సంఘటనలు జరిగితే, రికార్డు కెక్కనివి ఎన్నో. 2019లో నమోదైన 32,033 అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 18 శాతం నమోదైనాయి. బాధితుల్లో 11 శాతం దళిత మహిళలే. 

2017 డిసెంబర్‌లో భీమా కోరేగావ్‌ దళితుల ఆత్మగౌరవ పోరాటం, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని వేలాది ముస్లిం మహిళల షాహిన్‌బాగ్‌ పోరాటం, నేటి కోట్లాది రైతుల పోరాటం దేశ చరిత్రలో 3 ప్రధాన పోరాటాలు. 40 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి నిరుద్యోగిత చేరింది. డీమానిటైజేషన్, జీఎస్‌టీ అసంఘటిత రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ మాత్రమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కుటుంబ భారాన్ని మోయలేక మహిళలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. భరించినంత కాలం మహిళలపై భారం పడుతూనే ఉంటుంది. మన ముందున్నది రైతాంగ వ్యవసాయ కార్మిక మహిళా ఉద్యమం. కార్పొరేట్‌ హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని రంగాల మహిళలు మార్చి 8 స్ఫూర్తితో చేయి చేయి కలిపి అడుగులు వేయడమే కర్తవ్యం.

– అనిత, చైతన్య మహిళా సంఘం 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top