
నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్‌జీ యువతకు కమ్యునికేషన్ సాధనంగా ‘డిస్‌కార్డ్’ యాప్ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్ యాప్‌లో ఇంటర్నల్ కమ్యునికేషన్ టూల్‌గా వాడే డిస్‌కార్డ్ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్‌నేవిస్క్ 2015లో డిస్‌కార్డ్‌ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్‌ఫామ్. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్ కమ్యునికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్‌జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంతృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్ టూల్స్‌లో ఉన్న డిస్‌కార్డ్ యాప్ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.
ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్‌లోడ్‌ల పరంగా డిస్‌కార్డ్ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇది మొత్తం ఇన్‌స్టాల్స్‌లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే