 
													సంచార గతిని మార్చేసిన పారిశ్రామిక విప్లవం
సగానికి పడిపోయిన జలచరాల సంచారం.. 40 రెట్లు పెరిగిన మానవుల కదలికలు
సాక్షి, స్పెషల్ డెస్క్: 1850ల నాటి మాట... అప్పట్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నడకే ప్రధాన సాధనం. కానీ, 2025 నాటికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికైనా వెళ్లాలంటే కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు, రైళ్లు, విమానాలు.. ఇలా ఎన్నో మార్గాలు. అందుకే, ఇప్పుడు నడక అనేది ఏకంగా ఏడో స్థానానికి వెళ్లిపోయింది. భూమిపై ఉన్న జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్‌మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత.. సగానికి తగ్గిపోయింది. అదే సమయంలో మనుషులు అటూ ఇటూ తిరగడం 40 రెట్లు పెరిగింది.
సుప్రసిద్ధ నేచర్ జర్నల్‌కి చెందిన ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ విభాగంలో ప్రచురితమైన అధ్యయనం ఈ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భూమిపై జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్‌మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత తగ్గిపోవడానికి ప్రధాన కారణం.. చేపలు, తిమింగలాలను మనుషులు వేటాడటమే. చెప్పాలంటే మొత్తం మానవుల టీబీఎంలో.. భూమిపై ఉన్న జంతువులు, జలచరాలు, పక్షుల టీబీఎం ఆరోవంతు మాత్రమేనట. ప్రస్తుతం మానవ సంచారంలో దాదాపు 65 శాతం.. మోటారు వాహనాల ద్వారానే జరుగుతోంది. నడక ద్వారా 20 శాతం ఉంటే.. సైకిల్ ద్వారా జరుగుతున్నది మరో 20 శాతం. విమానాల ద్వారా తిరుగుతున్నవారు 10 శాతం కాగా, రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నవారు 5 శాతం.
ఆ నాలుగూ కారణం
ఈ అధ్యయనంలో అమెరికా, జర్మనీ, ఇజ్రా యెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు మానవ ప్రయాణాలు పెరగడానికి కార ణాలుగా ప్రధానంగా 4 అంశాలను పేర్కొన్నారు.
⇒  జనాభా పెరుగుదల
⇒  మోటారు వాహనాల వాడకం పెరగడం 
⇒  శిలాజ ఇంధనాల వినియోగంలో వృద్ధి
⇒  ప్రయాణాలకు అనువైన సదుపాయాలు, సౌకర్యాల ఏర్పాటు
⇒ అధిక ఆదాయ దేశాల్లో ఉన్నవారు ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం. మొత్తం జనాభా కదలికల్లో వీరిదే దాదాపు 30 శాతం.
⇒  అల్పాదాయ దేశాల్లో ఉన్న వారు ప్రపంచ జనాభాలో 9 శాతం. మొత్తం జనాభా సంచారంలో  వీరి వాటా కేవలం 4 శాతమే.
95 శాతానికి పెరిగింది
1850లలో..ఈ భూమిపై మొత్తం క్షీరదాల్లో క్రూర మృగాల (జలచరాలు, వన్యప్రాణులు) బరువు 50 శాతం ఉంటే.. మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు 50 శాతం ఉండేది. 2020 నాటికి మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు ఏకంగా 95 శాతానికి పెరిగిపోయింది.
ఏమిటీ టోటల్ బయోమాస్ మూవ్‌మెంట్
మనుషుల జనాభాతో పోలిస్తే భూమిపై పక్షులు, జంతువులు చాలా ఎక్కువ కదా, మరి అవి ప్రయాణించే దూరం కంటే మనుషులు ప్రయాణించే దూరం ఎక్కువ కావడం ఏమిటి? అనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకు ప్రధాన కారణం దీన్ని గణించడానికి తీసుకునే ప్రమాణమే. పర్యావరణ ఆరోగ్యం, సహజ వనరుల వినియోగం, పర్యావరణంపై మానవుల ప్రభావం వంటి అంశాలు అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ‘టోటల్ బయోమాస్ మూవ్‌మెంట్’ను ఉపయోగిస్తారు.
దీని ప్రమాణమే గ్రాస్ టన్ను కిలోమీటర్లు (జీటీకే). ఒక ప్రాణి బరువును, అది ఒక ఏడాదిలో ప్రయాణించిన దూరంతో గుణిస్తే వచ్చేదే జీటీకే. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ జీటీకే అన్నమాట. చాలా పక్షులు ఏటా కొన్ని వేలు, లక్షల కిలోమీటర్లు వలస పోతుంటాయి. కానీ వాటి బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల వాటి టీబీఎం చాలా తక్కువగా ఉంటుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
