ఉత్తర కొరియా తన తూర్పు తీర ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ వెల్లడించాయి. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు ఉత్తర కొరియాలోని సిన్పో (Sinpo) ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) పేర్కొంది. తాము నిఘాను పెంచామని.. తదుపరి ప్రయోగాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నామని జేసీఎస్ తెలిపింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి మాట్లాడుతూ.. తమ మంత్రిత్వ శాఖ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తోందని తెలిపారు. అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఈ క్షిపణులు కొరియా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో పడిపోయాయని, జపాన్ భూభాగం, ప్రత్యేక ఆర్థిక మండలంలో (EEZ) ఎటువంటి ప్రభావం పడలేదని రక్షణ శాఖ ధృవీకరించింది. ఉత్తర కొరియా చివరిసారిగా ఏప్రిల్ 8న తన తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉత్తర కొరియా మరో ప్రయోగం కలకలం రేపుతోంది. ఈ నెలలోనే తమ దేశానికి చెందిన చోయ్ హ్యోన్ యుద్ధనౌక నుంచి రెండు స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులు, మూడు యాంటీ-వార్‌షిప్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ స్వయంగా పరిశీలించారు.
కాగా, గతంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని ట్రంప్ నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు’’ అని కిమ్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి స్పష్టత లేవు.


