ఇండో- అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు

Joe Biden To Nominate Neera Tanden As Budget Chief Reports - Sakshi

ఆర్థిక సలహాదారుల మండలి చైర్‌పర్సన్‌గా సిసిలా రౌజ్‌

బైడెన్‌ కొత్త టీం

వాషింగ్టన్‌: ఇండో-అమెరికన్‌, సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీరా టాండన్‌ను జో బైడెన్‌ బడ్జెట్‌ చీఫ్‌గా నామినేట్‌ చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు మెనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో నీరా హెల్త్‌కేర్‌ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆనాటి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు.

ఇదిలా ఉండగా.. ప్రముఖ ఎకనమిస్ట్‌ సిసిలా రౌజ్‌నును ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. ఇక ఒబామా హయాంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన( అంతర్జాతీయ) పని చేసిన వాలీ అడెయోమోను కూడా బైడెన్‌ తన టీంలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. కోశాగార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జానెట్‌ ఎల్‌. యెలెన్‌కు వాలీని డిప్యూటీగా అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అత్యంత సన్నిహితుడు, ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు ఆర్థిక సలహాదారుగా ఉన్న జారేద్‌ బెర్న్‌స్టీన్ సహా హైదర్‌ బౌషీలకు కూడా ఆర్థిక సలహాదారుల మండలిలో స్థానం కల్పించేందుకు బైడెన్‌ సుముఖంగా ఉన్నారని పేర్కొంది. (చదవండి: స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్‌)

కాగా కరోనా సంక్షోభం, నిరుద్యోగిత పెరిగిన నేపథ్యంలో అమెరికాలో 2009 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఆనాడు దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడంలో ఒబామా టీంలో ఉన్న ఆర్థికవేత్తలు కీలక పాత్ర పోషించారు. కోవిడ్‌-19తో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ఉద్దీపన ప్యాకేజీలు, వాక్సిన్‌ కొనుగోలు- పంపిణీ తదితర సవాళ్లు ముందున్న వేళ బైడెన్‌ సైతం మెరికల్లాంటి, ప్రతిభ గల ఎకనమిస్టులను తన టీంలోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టవచ్చనే యోచనలో బైడెన్‌ ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. 

ఇక ఇప్పటికే విదేశాంగ విధానంపై దృష్టి సారించిన బైడెన్‌.. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్-‌ అంటోనీ బ్లింకెన్, ప్రెసిడెన్షియల్‌ ఎన్వాయ్‌ ఫర్‌ క్లైమేట్‌(పర్యావరణ అంశాల ప్రతినిధి)- జాన్‌ కెర్రీ, సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీగా అలెజాండ్రో మయోర్కస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌- అవ్రిల్‌ హెయిన్స్‌, ఐరాసలో యూఎస్‌ దౌత్యవేత్త- లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సల్లివన్‌,చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌- రాన్‌ క్లెయిన్‌కు నియమించిన విషయం తెలిసిందే.(చదవండి: జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top