మళ్లీ ఎన్నికల బరిలోకి 

Joe Biden announced Tuesday he will run for reelection in 2024 - Sakshi

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అధికారిక ప్రకటన

మళ్లీ రన్నింగ్‌ మేట్‌గా ఉపాధ్యక్షురాలు కమల 

వాషింగ్టన్‌: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్‌ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు.

భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌నే మరోసారి తన రన్నింగ్‌ మేట్‌గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ కి చెందిన బైడెన్‌ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గారికార్డు సృష్టించారు. 

బైడెన్‌పై ట్రంప్‌ ధ్వజం: బైడెన్‌ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్‌ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్‌ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు.  

రిపబ్లికన్ల అతివాదంపై పోరు 
2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్‌ అభివర్ణించారు. అబార్షన్‌ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు.

‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్‌ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్‌ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top