కవాసాకి రోబో మేక.. బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! | Sakshi
Sakshi News home page

Kawasaki Robotic Goat: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట!

Published Fri, Mar 25 2022 2:26 PM

japan Kawasaki Made A rRideable Robotic Goat Details Inside - Sakshi

ఈ చిత్రం చూశారా? చిన్న పిల్లలు ఎక్కి ఆడుకునే కొయ్యగుర్రంలా కనిపిస్తోంది కదూ..! కానీ ఇదో రోబో మేక. జపనీస్‌ టెక్‌ దిగ్గజం కవాసాకి తయారు చేసిన ఈ మేక మీద మీరూ ప్రయాణించొచ్చు. దాని విశేషాలేంటో తెలుసుకుందామా! 

కృత్రిమ మేథ నానాటికీ పురోగతి చెందుతోంది. మొదట మానవ రూపంలో రోబోలు, యంత్రాలను తయారు చేశారు. ఆ తరువాత జంతువులను పోలిన రోబోలు కూడా వచ్చాయి. ఇటీవల టోక్యోలో జరిగిన అంతర్జాతీయ రోబో ఎగ్జిబిషన్‌లో అద్భుతమైన ఆవిష్కరణలున్నాయి. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఈ రోబోమేక బెక్స్‌. దీని తయారీ కోసం  కవాసాకి.

యూరప్, ఆసియా, అఫ్రికా ప్రాంతాల్లోని అడవిమేక ఐబెక్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నది. పర్వత ప్రాంతాల్లో సులభంగా తిరిగే ఈ మేక బరువులనూ సునాయాసంగా మోయగలదు. ఎత్తులను ఎక్కడంలో, వాలు ప్రాంతాలను చాకచక్యంగా దిగడంలో దిట్ట. ఐబెక్స్‌ మేకకున్న అన్ని విశేషాలను ఈ రోబోమేకకు యాడ్‌ చేశారు తయారీ దారులు. ఐబెక్స్‌ అతి చురుకైనది. మన బెక్స్‌ మాత్రం అంత చురుకుగా కదలలేదు.

కానీ సాధారణ మేక కంటే బలమైనది. మైదాన ప్రాంతంలో మోకాళ్లపై వేగంగా వెళ్లగలుగుతుంది. మోకాళ్లలో ఏర్పాటు చేసిన చక్రాలు అందుకు ఉపయోగపడతాయి. ఎత్తుపల్లాల్లో తన పొడవైన కాళ్లతో ఈజీగా ఎక్కగలుగుతుంది. ఇది కదులుతున్నప్పుడు పొడవైన మెడ, కొమ్ములు వెలుగుతూ ఉంటాయి. బెక్స్‌ 100 కిలోల బరువును మోయగలదు. మనుషులతోపాటు వివిధ రకాల వస్తువులను రవాణా చేయగలదు. ఈ రోబోలో ఇంకా ఎన్నో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉందని కవాసాకి చెబుతోంది. ఏదేమైనా బెక్స్‌.. మొట్టమొదటి రోబో మేకగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.  

Advertisement
Advertisement