
గాజా సహాయ నౌకాయాత్ర బృందంపై ఇజ్రాయెల్ దాడి
గ్రెటా థన్‌బర్గ్ నిర్బంధం.. దౌర్జన్యం
పర్యావరణ ఉద్యమ కార్యకర్తల ఆరోపణ
టెల్ అవీవ్: గాజాకు మానవతా సాయం తీసుకెళ్లిన నౌకాయాత్ర సభ్యురాలైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌తో ఇజ్రాయెల్ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని సహ కార్యకర్తలు ఆరోపించారు. ఆమెను నిర్బంధంలోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారని.. ఆ యాత్రలో పాల్గొన్న పలువురు పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు తెలిపారు.
టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం.. గాజాకు సహాయాన్ని తీసుకెళ్లిన నౌకలో ప్రయాణించిన 137 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలను ఇజ్రాయెల్ బహిష్కరించింది. వారు శనివారం ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు. ఈ బృందంలో 36 మంది టర్కిష్ జాతీయులు సహా అమెరికా, యూఏఈ, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.
జంతువుల్లా చూశారు..
గ్రెటా థన్‌బర్గ్‌పై జరిగిన దురుసు ప్రవర్తనను కళ్లారా చూశామని.. మలేషియా జాతీయుడైన హజ్వానీ హెల్మీ, అమెరికన్ పౌరుడు విండ్‌ఫీల్డ్ బీవర్ అనే ఇద్దరు కార్యకర్తలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ‘అదొక విపత్తు. మమ్మల్ని జంతువుల్లా చూశారు. గ్రెటా థన్‌బర్గ్‌ను జుట్టు పట్టుకొని లాగి, ఇజ్రాయెల్ జెండాను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశారు’.. అని 28 ఏళ్ల హెల్మీ ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రమైన ఆహారం, నీరు కూడా ఇవ్వలేదన్నారు.
నల్లులున్న గదిలో బంధించి..: గ్రెటా థన్‌బర్గ్ అనుచరులకు స్వీడిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపిన ఒక ఈమెయిల్‌లో.. థన్‌బర్గ్‌ను నల్లులున్న గదిలో ఉంచారని, సరైన ఆహారం, నీరు ఇవ్వలేదని పేర్కొన్నట్లు ’ది గార్డియన్’ పత్రిక వెల్లడించింది. ‘రాయబార కార్యాలయం గ్రెటా థన్‌బర్గ్‌ను కలవగలిగింది. తనకు నీరసంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తగినంత నీరు, ఆహారం అందలేదు. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి.. అవి నల్లుల వల్లే వచ్చాయని అనుమానిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది..’ అని ఈమెయిల్‌లో వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది.