- ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో దాడులు
- ఐఆర్‌జీసీ నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మృతి
- హార్మూజ్ మూసివేతకు బాధ్యుడు అలీరెజా
- మీడియాకు తెలిపిన ఇజ్రాయెల్ అధికారి
టెహ్రాన్: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం జెరూసలేం పోస్ట్ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది.
హార్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్ ఉంది. ప్రపంచ వాణిజ్య చమురు, సహజ వాయువు సుమారు 20 శాతం హార్మూజ్ గుండా సాగుతుంది. ఈ జలసంధి మూసివేతకు బాధ్యుడిగా అలీరెజాను పేర్కొంటారు. అతడి మరణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కీలక పరిణామం. ఎందుకంటే ఐఆర్‌జీసీ నౌకాదళానిదే ఇరాన్ సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసేది కూడా ఐఆర్‌జీసీ నౌకాదళమే.
హార్మూజ్‌పై పట్టును మరింత సాధిస్తున్న వేళ
ప్రస్తుతం హార‍్మూజ్ జలసంధిపై పట్టును మరింత పెంచుకుంటోంది ఇరాన్. కాల్పుల విరమణ ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ “డీ ఫాక్టో టోల్ బూత్ విధానం” (అధికారిక ప్రకటన లేకుండా అమలులో ఉన్న ఫీజు వ్యవస్థ) అమలు చేస్తోందని నిపుణులు చెప్పారు.
ఈ విధానంలో కొన్ని నౌకలు తమ సరుకు వివరాలు, సిబ్బంది సమాచారం, గమ్యస్థానం వివరాలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు అందించాలి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ (నౌకాయాన విశ్లేషణ సంస్థ) కూడా ఇదే విధానాన్ని ప్రస్తావిస్తూ, కనీసం రెండు నౌకలు జలసంధి గుండా వెళ్లేందుకు చైనా యువాన్‌లో ఫీజులు చెల్లించాయని తెలిపింది.
ఈ ఫీజు వసూలు వ్యవస్థను అధికారికం చేయడానికి తమ పార్లమెంట్ ప్రయత్నిస్తోందని ఇరాన్ నేత ఒకరు అన్నారు. “మేమే భద్రత కల్పిస్తున్నాం, నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ ఫీజులు చెల్లించడం సహజమే” అని చెప్పారు.
ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ (అంతర్జాతీయ చమురు ధర సూచిక) ధర గురువారం 104 డాలర్ల వద్ద ఉంది, ఘర్షణ ప్రారంభం నుంచి 40 శాతం పైగా పెరిగింది.


