
టెహ్రాన్: ఇరాన్‌పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.
రష్యాకు ఇరాన్ రక్షణమంత్రి
ఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్‌ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.
‘ఇరాన్‌కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు.
ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..
ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్‌పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.
ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్‌ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘
అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.
మరొకవైపు ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్‌లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది.
ఏదైనా జరగొచ్చు..
ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్‌కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది.
ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్‌కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్‌కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు.