భారత్‌ సహా 5 దేశాలకు హార్మూజ్‌లో గ్రీన్‌సిగ్నల్‌ | Iran opens Strait of Hormuz for India and other countries | Sakshi
Sakshi News home page

భారత్‌ సహా 5 దేశాలకు హార్మూజ్‌లో గ్రీన్‌సిగ్నల్‌

Mar 27 2026 3:42 AM | Updated on Mar 27 2026 11:56 AM

Iran opens Strait of Hormuz for India and other countries

టెహ్రాన్‌/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్‌ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్‌కు ఇరాన్‌ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. 

చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్‌లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్‌ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్‌ జలసంధి. 

ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్‌ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్‌ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్‌ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement