‘ఓసారి భారత్‌ రండి’.. ట్రంప్‌నకు ఇరాన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ | Iran Counter Donald Trump Controversial Remarks Over India | Sakshi
Sakshi News home page

‘ఓసారి భారత్‌ రండి’.. ట్రంప్‌నకు ఇరాన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

Apr 24 2026 11:35 AM | Updated on Apr 24 2026 11:48 AM

Iran Counter Donald Trump Controversial Remarks Over India

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఘాటుగా స్పందించాయి. ట్రంప్ తన ట్రూత్‌ సోషల్‌లో రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలు(Hell-holes)గా అభివర్ణించడమే కాకుండా.. అక్కడి నుండి వచ్చే వలసదారులను ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు" అంటూ విమర్శించారు.

ఈ క్రమంలో ‘భారత్‌ వచ్చి చూడండి’ అంటూ ముంబాయిలోని ఇరాన్‌ ఎంబసీ.. ట్రంప్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చింది. భారత్‌కు వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడాలంటూ సూచించింది ‘భారత్‌లోని అభివృద్ధి, సంప్రదాయాలు ట్రంప్‌నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకురావాలి’’ అంటూ పోస్ట్‌ పెట్టింది. భారత్ అందాలు ప్రశంసిస్తూ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హెవెన్ మోడ్(స్వర్గంలా)ఉంటాయని... సాంస్కృతిక విలువలు ఎంతో గొప్పవని ఇరాన్‌ పేర్కొంది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. 

కాగా, ట్రంప్‌ ‘నరకం’ వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని.. అత్యంత దారుణంగా ఉన్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే "బర్త్‌రైట్ సిటిజన్‌షిప్"(జన్మతః పౌరసత్వం) రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుండి వచ్చే వలసలను విమర్శిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే, పరిస్థితి ముదురుతుండటంతో అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్ గతంలో భారత్‌ను "గొప్ప దేశం" అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement