International Men's Day Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Men's Day 2021: మా కష్టాలు మీకేం తెలుసు?

Nov 19 2021 10:27 AM | Updated on Nov 19 2021 5:37 PM

International Mens Day Special Story In Telugu - Sakshi

International Mens Day: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్‌ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. 

ఏమని చెప్పాలి.. 
‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. 

త్యాగాలు గుర్తించండి! 
‘సంపాదించాలి. కుటుంబ ఉన్నతికి పాటుపడాలి. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కుమారుడిగా ఉండాలి’.. పురుషులపై సమాజం పెట్టిన బాధ్యత ఇది. ఇందులో ఎక్కడ విఫలమైనా ఛీత్కారం తప్పదు. ఇంత చేసినా కీలక సమయంలో న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదని పురుష బాధితులు వాపోతున్నారు. ‘భార్య విడాకులు కోరినప్పటికీ.. పిల్లలకు తండ్రే దూరం కావాలి. 90 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది. గృహ హింస కేసుల్లో అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారు. ఇదంతా పురుషులపై వివక్షే’అని చెబుతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుల్లో అత్యధికులకు సొంత ఆకాంక్షలేవీ ఉండవు. ఉన్నా వదిలేసుకుంటారు. కష్టమైనా, నష్టమైనా, ఏం చేసినా, ఎంత సంపాదించినా కుటుంబం కోసమే! అలాంటప్పుడు పురుషుల త్యాగాలకు కనీస గుర్తింపు ఇవ్వడంలో తప్పేముంది? ‘పురుషుల దినోత్సవమంటే జోక్‌ కాదు. కుటుంబం, సమాజం కోసం పురుషులు చేస్తున్న త్యాగాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకోవడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశం..’ 


పురుషులకు హెల్ప్‌లైన్‌.. 
భారత్‌లో సందర్భం, అవసరాన్ని బట్టి సాయం చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లు అనేకం ఉన్నాయి. ఇటీవల మహిళల కోసం, చిన్న పిల్లల కోసం కూడా ఇలాంటి హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేశారు. కష్టాల్లో చిక్కుకున్న పురుషుల కోసం కూడా ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వారే స్వయంగా ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ (8882 498 498) ఏర్పాటు చేసుకున్నారు.  

మా కష్టాలు మీకేం తెలుసు? 
మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ (ఎస్‌ఐఎఫ్‌)’.. మహిళా కమిషన్‌ లాగానే పురుష కమిషన్‌ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement