Indonesian Man: భార్యగా మారిన భర్త.. చివరకు విమానం బాత్రూమ్‌లో..

Indonesian Man Disguised Himself As Wife To Board A Plane - Sakshi

జకర్తా (ఇండోనేసియా): ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనేక ఆంక్షలతో జరుగుతున్నాయి. కరోనా నెగటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఓ కోవిడ్‌ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. చివరకు తాను చేరుకోవాల్సిన గమ్యస్థానంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఇండోనేసియాలో జరగ్గా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కోవిడ్‌ పాజిటివ్‌ సోకిన వ్యక్తి ఇండోనేసియాలోని జకర్తా నుంచి అదే దేశంలోని మరో పట్టణం టెర్నేట్‌కు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే అతడికి కరోనా వైరస్‌ సోకింది. ఎలాగైనా విమాన ప్రయాణం చేయాలని తన భార్య పేరు మీద సిటిలింక్‌ విమానంలో టికెట్‌ బుక్‌ చేశాడు. అనంతరం ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎయిర్‌పోర్టుకు బురఖా ధరించి వచ్చాడు. తనిఖీల సమయంలో తన భార్య పాస్‌పోర్టు, ఇతర పత్రాలు, కార్డులు చూపించడంతో అధికారులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా బురఖా ధరించడంతో వారు మహిళగా భావించారు. అనంతరం ఆయన విమానం ఎక్కి టెర్నేట్‌కు చేరుకుంటున్నాడు. అయితే అతడు చేసిన చిన్న తప్పు పోలీసులకు పట్టేలా చేసింది. 

టేకాఫ్‌ అయ్యే సమయంలో అతడు బాత్‌రూమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతడు పురుషుల దానిలో వెళ్లాడు. వచ్చేప్పుడు బురఖా తీసి బయటకు వచ్చాడు. ఈ విషయం విమాన సిబ్బంది గ్రహించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన విమానం దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌ వ్యక్తి ప్రయాణించడంతో ఆ విమానంలో ప్రయాణించిన వారంతా ఆందోళన చెందుతున్నారు. వారికి విమాన సిబ్బంది పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆ దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ విధంగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top