Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు | Sakshi
Sakshi News home page

Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు

Published Tue, Feb 13 2024 6:03 AM

Indonesia election 2024: Indonesia prepares for mega polls - Sakshi

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో పార్లమెంట్, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ జనాభా 27 కోట్లు కాగా, 20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 17 ఏళ్లు నిండినవారంతా ఓటు వేయడానికి అర్హులే. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం కోసం ప్రధానంగా మూడు పారీ్టలు హోరీహోరీగా తలపడుతున్నాయి.

ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్‌ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి కాదు. అయినా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది.

దేశంలో 575 పార్లమెంట్‌ స్థానాలు ఉండగా, 18 జాతీయ పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండుసార్లు మాత్రమే పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుంది.

ప్రస్తుత అధ్యక్షుడు జొకో విడొడో(జొకోవి) వరుసగా రెండుసార్లు గెలిచారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన రెండు టర్మ్‌లు పూర్తయ్యాయి. కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఈసారి మార్పు తప్పనిసరి కాబోతోంది. మొత్తం జనాభాలో 90 శాతం మంది ముస్లింలే ఉన్న ఇండోనేíÙయాలో పోలీసులకు, సైనికులకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు.  
 

40 కొత్త నగరాలు నిర్మిస్తాం  అనీస్‌ బాస్వెదాన్‌
జకార్తా మాజీ గవర్నర్, విద్యావేత్తగా పేరుగాంచిన అనీస్‌ బాస్వెదాన్‌(54) స్వతంత్ర, ప్రతిపక్ష            అభ్యరి్థగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్వదేశంలో తొలుత విద్యారంగంలోకి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. ఇక అనీస్‌ సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నేషనల్‌ అవేకెనింగ్‌ పార్టీ నేత, పీపుల్స్‌ రిప్రిజెంటేటివ్‌ కౌన్సిల్‌ డిప్యూటీ స్పీకర్‌ ముహైమిన్‌ ఇస్కాందర్‌(57) బరిలో ఉన్నారు. వీరికి మరో రెండు పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశవ్యాప్తంగా 40 కొత్త నగరాలు నిర్మిస్తామని అనీస్‌ బాస్వెదాన్, ఇస్కాందర్‌ హామీ ఇస్తున్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతున్నారు.  

సుబియాంటోకు విజయావకాశాలు!  
ఇండోనేసియా ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ప్రధానంగా ముగ్గురు నేతలు కన్నేశారు. ఇండోనేషియా జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి మాజీ సైనికాధికారి ప్ర»ొవో సుబియాంటో(72) పోటీలో ఉన్నారు. ఇదే పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జొకో విడొడో తనయుడైన 36 ఏళ్ల గిబ్రాన్‌ రాకాబుమింగ్‌ రాకా బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సుబియాంటో పోటీపడ్డారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు.

మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జొకోవి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సుబియాంటోపై పలు తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 1990వ దశకంలో సైనికాధికారిగా పని చేస్తున్న సమయంలో 20 మందికిపైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలను కిడ్నాప్‌ చేయించినట్లు ప్రచారం జరి­గింది. వారిలో 10 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుబియాంటో ఈస్ట్‌ తిమోర్, పపువా న్యూ గినియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు.

1998లో సైన్యం నుంచి తప్పుకున్నారు. 2020 వరకు తమ దేశంలో ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధం విధించింది. గిబ్రాన్‌ రాకాబుమింగ్‌ కూడా వివాదాస్పదుడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్‌గా పనిచేస్తున్నాడు. తమను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామని సుబియాంటో, గిబ్రాన్‌ హామీ ఇస్తున్నారు. గెరిండ్రా పారీ్టకి ఇతర చిన్నాచితక పారీ్టలు మద్దతిస్తున్నాయి. ఇప్పుడు అంచనాలను బట్టి చూస్తే ప్ర»ొవో సుబియాంటో తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  

అధ్యక్ష బరిలో విద్యావేత్త ప్రనొవో  
మెగావతి సుకర్నోపుత్రి సారథ్యంలోని ఇండోనేషియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ స్ట్రగుల్‌ నుంచి అధ్యక్ష పదవికి గాంజార్‌ ప్రనొవో(55), ఉపాధ్యక్ష పదవికి మహ్‌ఫుద్‌ ఎండీ(66) పోటీలో ఉన్నారు. ప్రనొవో గతంలో సెంట్రల్‌ జావా గవర్నర్‌గా సేవలందించారు. మహ్‌ఫుద్‌ ఎండీకి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ స్ట్రగుల్‌తో మరో మూడు పార్టీలు జట్టుకట్టాయి. ఇద్దరు అభ్యర్థులపై ఎలాంటి అరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలు తమకు తెలుసని, అధికారం అప్పగిస్తే వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని ప్రనొబో, మహ్‌ఫుద్‌            విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు సామాజిక సాయం పంపిణీ చేస్తామని, ఉద్యోగుల వేతనాలు పెంచుతామని         అంటున్నారు.   

కీలక ప్రచారాంశాలు?
► ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే ఇండోనేíÙయాలోనూ ఎన్నో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 2022లో 5.3 శాతం కాగా, 2023లో అది 5.05 శాతానికి పడిపోయింది.  
► దేశంలో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారింది.  
► నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోయాయి. ఉద్యోగులు, కారి్మకులకు వేతనాలు తగ్గిపోయాయి. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారే నిర్ణయాత్మక శక్తిగా తీర్పు ఇవ్వబోతున్నారు.
► దేశంలో మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుండడంపై యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెబుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement
Advertisement