భారత్‌ను లొంగదీసుకోవడం చాలాకష్టం: అమెరికా | India Will Not Yield So Easily: US Trade Representative | Sakshi
Sakshi News home page

భారత్‌ను లొంగదీసుకోవడం చాలాకష్టం: అమెరికా

Apr 24 2026 9:22 AM | Updated on Apr 24 2026 10:24 AM

India Will Not Yield So Easily: US Trade Representative

అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌ భారత్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అంత సులువుగా లొంగే దేశం కాదని అమెరికా చట్ట సభల్లో మాట్లాడుతూ అన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో వారి దేశ ప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో వారు పణంగా పెట్టరని  తేల్చిచెప్పారు.

ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్రతినిధుల బృందం అమెరికాతో వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌కు వెళ్లింది. అమెరికా తరపున చర్చలకు దక్షిణ మరియు మధ్య ఆసియాకు సంబంధించిన అసిస్టెంట్ USTR అయిన బ్రెండన్ లించ్ నేతృత్వం వహించారు. మూడు రోజుల పాటు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు  సోయాబీన్, ఎథనాల్ మరియు సుంకాల తగ్గింపుపై ఇరు దేశాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. అనంతరం భారత  ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసర్ గ్రీర్‌ చట్టసభల్లో ప్రస్థావించారు.

జేమీసర్ గ్రీర్‌ అమెరికా చట్టసభల్లో మాట్లాడుతూ... "ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. అది చాలాకాలంగా వ్యవసాయ మార్కెట్లకు సంరక్షురాలిగా ఉంది,  కనుక ఆ రంగలో రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. భారత్ అంత సులువుగా లొంగదు. ఆ దేశాన్ని లొంగదీయడం చాలా కష్టం" అన్నారు. భారత్ తన మార్కెట్‌ను అంత సులభంగా అమెరికాకు వదిలిపెట్టడం లేదని, చర్చల్లో భారత్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తోందని గ్రీర్ అభిప్రాయపడ్డారు.

ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు

అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, భారత ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినమైన నిబంధనలను, టారిఫ్‌లను (సుంకాలను) అమలు చేస్తోంది. వాటిని తగ్గించాలని అమెరికా ప్రతినిధులు కోరగా భారత్‌ దేశ రైతుల ‍ప్రయోజనాల దృష్ట్యా ఒప్పుకోనట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య  చర్చలు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను (ముఖ్యంగా ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు) కొనుగోలు చేసే దిశగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement