
పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగం
విండోహెక్: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు.
ఇది క్రికెట్ గ్రౌండ్‌లో వార్మప్
భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు.
ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్‌లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్‌డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు.
సంబంధాలు బలోపేతం చేసుకుందాం
ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్‌హౌస్‌లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్‌డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.
నాలుగు ఒప్పందాలపై సంతకాలు
నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్, సీడీఆర్‌ఐ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి.
మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెలి్వవిషియా మిరాబిలిస్’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు.