Russia Ukraine War Losses: How Many Have Been Killed In War? Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఇలా జరిగిందేంటి.. పుతిన్‌ తప్పు చేశారా..?

Mar 4 2022 8:35 AM | Updated on Mar 4 2022 1:59 PM

Huge Damage To Russia In War With Ukraine - Sakshi

ఉక్రెయిన్‌ తమ వశమైపోతుందని భావించిన రష్యాకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అన్ని వైపుల నుంచి ఆర్థిక ఆంక్షలతో తల్లడిల్లిపోతున్న రష్యా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన దాడి వారం రోజులుగా కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌ తమ వశమైపోతుందని భావించిన రష్యాకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఉక్రెయిన్‌లో ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు పట్టుకొని రష్యా సేనల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆయుధాలు కావాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసి తుది వరకు పోరాడుతామని చెబుతూ ఉంటే, అంచనాలు తలకిందులైన ఆగ్రహావేశాలతో రష్యా దాడిని ముమ్మరం చేసింది. నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. వారంరోజుల ఈ యుద్ధం ఇరు దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది..?

ఆక్రమణ
ఉక్రెయిన్‌ నగరాలే లక్ష్యంగా దాడి చేస్తున్న రష్యా వారం రోజులకి ఖెర్సన్‌ను ఆక్రమించగలిగింది. రాజధాని కీవ్, రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి బాంబుల వర్షం కురిపిస్తోంది. చెరించివ్, మారియూపాల్‌లును చుట్టుముట్టిన రష్యా బలగాలు ఏ క్షణంలోనైనా వాటిని ఆక్రమించే అవకాశాలున్నాయి.  
వలసలు
యుద్ధ భయంతో ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని ఉక్రెయిన్‌ నుంచి దాదాపుగా 10 లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. పోలాండ్‌కు అత్యధికంగా 5 లక్షల మందికిపైగా వెళితే, లక్ష మందికిపైగా హంగరీ బాట పట్టారు.

ప్రాణనష్టం  
ఉక్రెయిన్‌పై దాడి జరిగిన ఈ వారం రోజుల్లో ప్రాణనష్టంపై ఒక్కొక్కరి లెక్కలు ఒక్కోలా ఉన్నాయి. ఫిబ్రవరి 24న దాడి ప్రారంభమైన దగ్గర్నుంచి మార్చి 2 వరకు సాధారణ పౌరులు 2 వేల మందికిపైగా మరణించారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం చెబుతోంది. అయితే అమెరికా మాత్రం అంత నష్టం జరగలేదని 150 మంది వరకు మరణించారని వాదిస్తోంది. రష్యాకు చెందిన సైనికులు 9 వేల మంది చనిపోయారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం చెబుతూ ఉంటే, రష్యా ప్రభుత్వం 498 మంది  మరణించారని, మరో 1597 మంది గాయపడ్డారని అధికారికంగా వెల్లడించింది. అమెరికా లెక్కల ప్రకారం 1,500–2,000 మంది రష్యా సైనికులు మృతి చెందారు. యూఏఎఫ్, ఎన్‌జీయూ, వాలంటరీ ఫోర్సెస్‌ 1500 మంది వరకు మరణించారని అంచనాలున్నాయి. ఇక ఉక్రెయిన్‌కి చెందిన సైనికులు 2,870 మంది మరణిస్తే, 3,700 మంది గాయపడ్డారని రష్యా ప్రభుత్వం వెల్లడించింది.  మొత్తమ్మీద ఈ వారం రోజుల్లో అటు సైనికులు, ఇటు సామాన్యులు 5 వేల మందికిపైగా మరణించి ఉంటారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.  

ఆయుధాలు
రష్యా ఉక్రెయిన్‌లో మోహరించిన యుద్ధ ట్యాంకులు, విమానాలు, శతఘ్నులలో 3 నుంచి 5 శాతం నష్టపోతే, ఉక్రెయిన్‌ దగ్గరున్న ఆయుధాలలో 10 శాతం నష్టపోయినట్టు అంచనాలున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక గణాంకాలు లేవు. కాగా రష్యాకు చెందిన ఎన్నో ఆయుధాల్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్‌ చెబుతోంది. మొదటి అయిదు రోజుల్లోనే ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకారం రష్యా వైపు భారీగానే ఆయుధాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత ఇరు దేశాలు ఎలాంటి గణాంకాలు వెల్లడించలేదు.

ఆర్థిక వ్యవస్థ  
అన్ని వైపుల నుంచి ఆర్థిక ఆంక్షలతో తల్లడిల్లిపోతున్న రష్యా కరెన్సీ రూబుల్‌ రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూబుల్‌ విలువ 110కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూబుల్‌ విలువ 30శాతం తగ్గిపోయింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపించింది. బారెల్‌ ధర 117 డాలర్లకు చేరుకుంది. 2013 తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిపోవడం ఇదే మొదటిసారి. దీని ధర 120 డాలర్లకి చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి.  దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాలపై పడింది.

భారతీయులు..
యుద్ధం మొదలైన సమయానికి ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు ఉండగా 60 శాతం అంటే 12 వేల మందివరకు సరిహద్దులకు చేరుకున్నారు. వారిలో 7 వేల మందివరకు భారత్‌కు చేరుకోవడం, లేదంటే తిరుగు ప్రయాణంలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఇంకా 7 వేల నుంచి 8 వేల మంది వరకు భారతీయులు ఉన్నారని వారిని  వెనక్కి తేవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా మోదీ ప్రభుత్వం చెబుతోంది. 
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement