Vaccine For HIV-AIDS Cure: ఆ ఇంజక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్‌!

HIV-AIDS: Israel researchers develop new vaccine by gene editing - Sakshi

ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల కొత్త వ్యాక్సిన్‌

హెచ్‌ఐవీ వైరస్‌ను తటస్థీకరిస్తోంది

నేచర్‌ జర్నల్‌ వెల్లడి

టెల్‌ అవీవ్‌:  వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.

పరిశోధన వివరాలను నేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్‌ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్‌ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్‌–టైప్‌ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుంది.

వైరస్‌లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్‌ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్‌ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. ‘‘ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్‌ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేస్తున్నాయి. , యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన డాక్టర్‌ బర్జేల్‌ వివరించారు. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెడతామని ధీమా వెలిబుచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top