ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకాన్ దాస్ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(జనవరి 3వ తేదీ) కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరవుతుంది.
తన భర్తపై దాడి ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు ఈ ప్రాంతంలో ఎవరూ శత్రువులు లేరని, కానీ తన భర్తపై దారణంగా దాడి చేసి చావుకు కారణం కావడం తనకు అంతులేని ఆవేదన మిగిల్చిందన్నారు.
కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. రెండు రోజల క్రితం ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్‌కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్‌లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది.


