చండ ప్రచండ మార్తాండ!

High Frequency Radar Detection of Coronal Mass Ejections - Sakshi

శివమెత్తిన సూరీడు

25వ సౌరచక్రంలో ఉచ్ఛ దశ

జూన్‌ ముగిసేలోపే ‘సోలార్‌ మాగ్జిమమ్‌’

మహామచ్చ ‘ఏఆర్‌3590’ ఆవిర్భావం 

భూమికేసి చూస్తూ 3 ఆగ్రహ జ్వాలలు 

మున్ముందు కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ ముప్పు 

ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన  

భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ తొలిసారి ఈ నెల 18న కనిపించింది. భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది. వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24–26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ అమాంతంగా 25 శాతం పెరిగింది.

తొమ్మిది భూగోళాలకంటే పెద్ద మచ్చ అది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ ఇదే. దీనికి ఏఆర్‌3590 అని పేరుపెట్టారు. ఏఆర్‌ అంటే యాక్టివ్‌ రీజియన్‌. క్రియాశీల ప్రాంతం అని అర్ధం. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. అయితే భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా ఈ సౌరమచ్చపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ కన్నేశారు. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి.

సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతమైంది. సూర్యుడు అంతర్గతంగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సౌరమచ్చలు ఏర్పడతాయి. అక్కడి పరిసరాలతో పోలిస్తే ఈ మచ్చ ఉష్ణోగ్రత తక్కువ. మచ్చలో 3,600 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం.

గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచి్చపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరగడం, తీవ్ర సౌర తుపాన్లు చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని తెలుస్తోంది.

తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే అంటే 2024 జూలైలోపే ‘చండ మార్తాండ’(సోలార్‌ మాగ్జిమమ్‌/సౌర గరిష్టం) దశ దాపురిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచి్చపెడుతుందోనని కలవరపడుతున్నారు. ఈ ఉగ్రరూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. సోలార్‌ మాగ్జిమమ్‌ దశ ముగిసిందనేది అది పూర్తయిన ఆరు నెలలకుగాని ఖగోళవేత్తలు           గుర్తించలేరు.  

ఏఆర్‌3590తో ప్రమాదమే!  
సూర్యుడు లోలోపల ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. వీటినే సౌరజ్వాలలు (సోలార్‌ ఫ్లేర్స్‌) అంటాం. ఇవి సూర్యుడి ఉపరితలంపై అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తీవ్రత ఆధారంగా ‘సోలార్‌ ఫ్లేర్స్‌’ను    X,  M,  C,  B,  A అంటూ అవరోహణ క్రమంలో 5 రకాలుగా వర్గీకరించారు.

వీటిలో  X రకం ఫ్లేర్స్‌ మహా శక్తిమంతం, భూమికి హానికరం. సౌరమచ్చ ఏఆర్‌3590 ఈ నెల 21న రెండు  గీ రకం సౌరజ్వాలలను వెదజల్లింది. 22న X 6.3 తీవ్రతతో సౌరజ్వాలను వదిలింది. ఈ మచ్చలోని అస్థిర బీటా–గామా–డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని  X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో  X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ రూపంలో ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు.  

సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల
మారి్పడి  

సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ట స్థితిని సంతరించుకునే ‘సోలార్‌ మాగ్జిమమ్‌’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మారి్పడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్ల గా సౌర కనిష్ట/సోలార్‌ మినిమమ్‌ దశకు చేరతాడు. ఇదొక చక్రం.  

కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌
‘కరోనా’ అనేది సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండిన సూర్యుడి అతి బాహ్య పొర.  X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్‌ లైట్స్‌’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి.

1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ వల్ల కెనడాలోని క్యూబెక్‌ ప్రావిన్స్‌ అంతటా 9 గంటలపాటు విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్‌ గ్రిడ్స్‌ కుప్పకూలతాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్‌ నేవిగేషన్‌ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి.

టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ–పైపులైన్‌ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచాఫ్‌ చేస్తారు. లేకపోతే అవి మాడిపోయి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) బయటకు రారు.  X,  M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్‌’లో          ఎల్రక్టాన్ల సాంద్రత తీవ్రమవుతుంది.

దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్‌ ఫ్లేర్స్‌ నుంచి వచ్చే సౌరధారి్మకత అదే వేగంతో భూమిని తాకుతుంది. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్‌ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ 15–18 గంటల్లో భూమిని చేరుతుంది.  

అతి పెద్ద సౌర తుపాను!  
1860లో సోలార్‌ మాగ్జిమమ్‌ దశకు కొన్ని నెలల ముందు 1859 సెపె్టంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరగడం ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్‌లోని ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్‌ కారింగ్టన్‌ వీరిలో ఒకరు. 1859 సెపె్టంబర్‌ ఒకటిన సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌.

ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ 17.6 గంటల్లో భూమిని చేరుకుంది. కారింగ్టన్‌ ఈవెంట్‌ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్‌ తుపాను ధాటికి టెలిగ్రాఫ్‌ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్‌ లైన్లపై టెక్నీíÙయన్లు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. కొన్నిచోట్ల టెలిగ్రాఫ్‌ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’కు కారణమైన నలమచ్చతో పోలిస్తే నేటి సౌరమచ్చ పరిమాణం 60 శాతంగా ఉంది. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు.  

– జమ్ముల శ్రీకాంత్‌

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top