Bird Flu: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా?

H5n1 Bird Flu Outbreak Next Pandemic Chances - Sakshi

ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్‌ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముంగిస,  పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో హెచ్‌5ఎన్‌1 తదుపరి ముప్పు మానవులకేనా? ఇది మరో మహమ్మారిగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందా? అనే చర్చ మొదలైంది.

ఈ వైరస్‌ ఐరోపా  చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు.  పక్షలకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి H5N1. 1997లోనే దీన్ని తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు.  కేసుల సంఖ్య తక్కువే ఉంది కదా? అనుకోవద్దు. ఎందుకంటే హెచ్‌5ఎన్‌1 సోకిన వారిలో 50 శాతం మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ ఇన్‌ఫ్లూయెంజా 1,000 మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే 2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే ఈ వైరస్ కొత్త వంశం ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు గణాంకాల్లో ఉంది. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు.

2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615  జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు ఈ 2,701 కేసులు వెలుగుచూశాయి.

మరో మహమ్మారిగా అవతరిస్తుందా?
ఈ బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం ఉండటం ప్రజారోగ్య అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్‌1ఎన్‌1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్‌లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉండటం గమనార్హం. ఒకవేళ హెచ్‌5ఎన్‌1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ అవకాశం లేదని చెప్పి కాస్త ఊరటనిచ్చారు.

ఇటీవల హెచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా మెలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ తెలిపారు. వీరిలో పౌల్ట్రీ ఫాంలతో పనిచేసేవారు, పక్షులు, జంతువులను చంపేవారు ఉన్నట్లు పేర్కొన్నారు.

అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే  ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు ఈ ఫ్లూ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top