మౌత్‌వాష్‌తో కరోనా వ్యాప్తికి చెక్‌?!

Gargling With Mouthwash Might Lower Spread of Coronavirus - Sakshi

బెర్లిన్‌: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి ఈ పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో  మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్‌ వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేశారు. (లిక్విడ్‌ బదులు జెల్‌ శానిటైజర్లు విక్రయించాలి)

కరోనా రోగుల్లో గొంతు, కావిటీలోల​ ఎక్కువ మొత్తంలో వైరల్‌ లోడు కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం.. వైరస్‌ బారిన పడిన వారు ఇతరులతో మాట్లాడటం, దగ్గడం, చీదడం వంటివి చేసినప్పుడు వైరస్‌ డ్రాప్‌లెట్స్‌ అవతలి వారి మీద పడటంతో వారు కోవిడ్‌ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్‌ కణాల సంఖ్య తగ్గి.. వ్యాప్తి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన కోసం వారు జర్మనీలోని ఫార్మసీలలో లభించే 8 రకాల మౌత్‌వాష్‌లను పరీక్షించారు. ఇవన్ని వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పుక్కిలించడం వల్ల లాలాజల వైరల్ లోడ్ తగ్గి.. తద్వారా కరోనా వైరస్‌ ప్రసారం తగ్గుతుందన్నారు.

స్టడీలో భాగంగా పరిశోధకులు మౌత్‌వాష్‌లను వైరస్‌ కణాలతో కలిపి.. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత వెరో ఈ6 కణాలను పరీక్షించగా వైరస్‌ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెరో ఈ6 కణాలు వైరస్‌ను ఆకర్షిస్తాయని తెలిపారు. ఈ  పరిశోధనలో చాలా మౌత్‌వాష్‌లు సమర్థవంతంగా పని చేశాయని.. ప్రత్యేకంగా మూడు రకాలు వైరస్‌ను పూర్తిగా తొలగించినట్లు కనుగొన్నామన్నారు. పుక్కిలించిన తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందనే అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం వల్ల వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు అంటున్నారు.(కరోనా సీజనల్‌ వైరస్‌ కాదు: డబ్ల్యూహెచ్‌వో)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top