యూరప్‌ నుంచి భారతీయులు వెనక్కి

Foriegn Countries Sending Back Indians Due To Corona Second Wave - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌తో భారతీయులను పంపించేస్తున్న విదేశాలు

ఖైదీలు, కూలీలు, ఉద్యోగులు అంతా వెనక్కి వస్తున్న వైనం

నిత్యం హైదరాబాద్‌కు చేరుకుంటున్న 2 వేల మంది

ప్రయాణికుల్లో బ్రిటన్, అమెరికాల నుంచి వచ్చే వారే ఎక్కువ 

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా సెకండ్‌ వేవ్‌తో గడగడలాడుతున్న యూరప్, అమెరికా తదితర దేశాలు అక్కడున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి. ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన ఇక్కడి వారు తిరిగొస్తున్నారు. అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న మనవారిని కూడా పంపించేస్తున్నారంటే కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం హైదరాబాద్‌కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్‌ టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, కొందరైతే హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు చేయించుకుంటున్నారు. అందుకోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేసే లేబొరేటరీని ఏర్పాటు చేశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందరికీ అందించడం ఆయా దేశాలకు సవాల్‌గా మారింది. అందువల్ల అవకాశమున్నంత మేరకు విదేశీయులను వారి దేశాలకు పంపించేస్తున్నాయి. హైదరాబాద్‌కు విమానాల ద్వారా బ్రిటన్, అమెరికా దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటు సింగపూర్, దుబాయ్‌ల నుంచి కూడా కొందరు వస్తున్నారు. యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన వారు లండన్‌కు వచ్చి అక్కడి నుంచి ఇక్కడకు చేరుకుంటున్నారు. వీరేగాక ఆయా దేశాల్లో విమానాలు ఎక్కిన వారు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో దిగి దేశంలో స్థానిక విమానాల ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇటు ఆయా దేశాల నుంచి వచ్చే ఖైదీల్లో కొందరు హైదరాబాద్‌లో దిగాక కనీసం హోటల్‌ క్వారంటైన్‌లో కూడా ఉండలేని దుస్థితి నెలకొంది. డబ్బులు లేవని, తమను విడుదల చేసి పైసా చేతిలో పెట్టకుండా పంపించేశారని వారంటున్నారు. 

మరో 10 విమానాలకు అనుమతి..
విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగటంతో మరిన్ని విమానాలు నడిపేందుకు కొన్ని విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించేలా, అందుకు అవసరమైన సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. మరో పది విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజుకు మరో 4 వేల మంది వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కరోనా కారణంగానే తాము ఇక్కడకు వస్తున్నట్లు, ఆయా దేశాల ప్రభుత్వాలు పంపించి వేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. యూరప్‌ వంటి దేశాల్లో కరోనా టెస్టులు చేయించుకోవడం కూడా కష్టంగా మారిందని.. ఇక్కడ కరోనా పరీక్షలు విమానాశ్రయంలోనే చేస్తుండటంతో కొంతమేరకు ఊరటగా ఉందని అంటున్నారు. విదేశాల నుంచి వేలాది మంది వస్తుండటంతో కరోనా నెగెటివ్‌ రిపోర్టులు చూడడం, రిపోర్టులు లేని వారికి పరీక్షలు చేస్తుండటంతో విమానాశ్రయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. 

జైలు నుంచి పంపించేశారు.. 
ఒక నేరం విషయంలో ఇటలీలో నాకు జైలు శిక్ష విధించారు. దాదాపు రెండేళ్లుగా జైలులోనే ఉన్నాను. మొదటి విడత కరోనా వచ్చిన సమయంలో ఇటలీ వణికిపోయింది. నేనున్న జైలులో అనేకమంది కరోనా బారిన పడ్డారు. కొందరు చనిపోయారు. ఇప్పుడు అక్కడ సెకండ్‌ వేవ్‌ మొదలు కావడంతో పరిస్థితి ఘోరంగా మారింది. జైళ్లను ఖాళీ చేస్తున్నారు. నేరస్తుల కంటే కరోనా ప్రమాదంగా మారడంతో వదిలేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఖైదీలను వారి దేశాలకు పంపించేస్తున్నారు..
– ఇటలీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు

లండన్‌లో దారుణంగా పరిస్థితి.. 
నేను లండన్‌లో ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మొదటి విడత కరోనా కారణంగా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోయింది. సెకండ్‌ వేవ్‌ మొదలు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం నేను పనిచేసే కంపెనీ మూతపడింది. ఏ దిక్కులేక మన రాష్ట్రానికి తిరిగి వచ్చాను..
– బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top