నేపాల్‌లో సంచలనం.. మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్‌ | Ex-Nepal PM KP Oli arrested | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో సంచలనం.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్‌

Mar 28 2026 7:07 AM | Updated on Mar 28 2026 12:39 PM

Ex-Nepal PM KP Oli arrested

ఖాట్మాండ్‌: నేపాల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ  శనివారం తెల్లవారుజామున అరెస్టు అయ్యారు. నేపాల్‌లో  జెన్ జెడ్ నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన ఘటనకు సంబంధించి, నరహత్య కేసులో ఆయనను అరెస్ట్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, నేపాల్‌ ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజే ఆయన అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది.

ఇక, ఇదే కేసులో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా అరెస్టు అయ్యారు. భక్తపూర్‌లోని వారి నివాసాల నుండి ఈ ఇద్దరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగల నిబంధనల కింద అభియోగాలు మోపే అవకాశం ఉంది. నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) నాయకుడైన ఓలీపై విచారణ జరపాలని నేపాల్‌లోని ఒక ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది.

కాగా, కేపీ శర్మ ఓలీ హయాంలో పాలనా వైఫల్యాలు, అవినీతి, నిరుద్యోగం, రాజకీయ అస్థిరతపై ప్రజల్లోని ఆగ్రహంతో 2025 సెప్టెంబర్‌లో ‘జెన్ జెడ్ విప్లవం’గా పిలవబడే భారీ యువత తిరుగుబాటు నేపాల్‌ను అట్టుడికింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణమించడంతో ప్రభుత్వం తీవ్ర అణచివేతకు పాల్పడింది. తత్ఫలితంగా జరిగిన హింసా కాండలో కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. 

నేపాల్‌ ప్రధానిగా షా..
ఇదిలా ఉండగా.. నేపాల్‌లో రాప్‌ నుంచి నవతరం నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా ‘బాలెన్‌’ (35) శుక్రవారం నేపాల్‌ ప్రధానిగా ప్రమాణం చేశారు. శీతల్‌ నివాస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలెన్‌తో దేశ అధ్యక్షుడు రామ్‌ చంద్రపౌడెల్‌ ప్రమాణం చేయించారు. గతంలో ఖాట్మాండ్‌ నగర మేయర్‌గా పనిచేసిన బాలెన్‌... ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక, కొత్తగా ఏర్పాటైన బాలేంద్ర షా మంత్రివర్గం తొలిరోజే సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబరు నెలలో జరిగిన జెన్‌ జెడ్‌ ఉద్యమంపై దర్యాప్తు జరిపిన ఉన్నతస్థాయి కమిషన్‌ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement