
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ
ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్‌లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్‌గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది.